Telangana War on drugs: మాదకద్రవ్యాల కట్టడిలో భాగంగా వాటిని ఉపయోగించే వారిపై దృష్టి సారించే దిశగా దర్యాప్తు సంస్థలు అడుగులు వేస్తున్నాయి. డిమాండే సరఫరాకు మూలం అనే సూత్రం ఆధారంగా వ్యూహరచన చేస్తున్నాయి. మాదకద్రవ్యాల వినియోగం బాగా ఉన్న ప్రాంతాలకే స్మగ్లర్లు రిస్క్ తీసుకొని మరీ చేరవేస్తున్నారనే కోణంలో సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుడుతున్నాయి. అసలు డిమాండే లేకుండా చేయగలిగితే సరఫరాదారుల్ని కట్టడి చేసేందుకు వీలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈక్రమంలో వినియోగానికి ఆస్కారమున్న హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, ఆటోస్టాండ్లు, విద్యాసంస్థలు, ఐటీ సంస్థలు.. లాంటి హాట్‌స్పాట్లలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలు నిర్ణయించాయి.
ఇకపై కొంత కఠినంగా...
ఇప్పటివరకు మాదకద్రవ్యాల్ని సరఫరా చేసే ముఠాలపైనే కఠిన చట్టాలు ప్రయోగిస్తున్న దర్యాప్తు సంస్థలు.. వినియోగదారులను బాధితులుగానే గుర్తిస్తున్నాయి. టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ ఇదే కారణంతో సినీప్రముఖులు గండం నుంచి గట్టెక్కారు. డ్రగ్స్ పెడ్లర్ కెల్విన్ సెల్‌ఫోన్లకు పలువురు సినీ ప్రముఖులు వాట్సప్ ద్వారా చేసిన చాటింగ్‌లు, నగదు లావాదేవీలను ఎక్సైజ్ వర్గాలు గుర్తించాయి. కానీ వీరిని ‘బాధిత వర్గం’గా పరిగణించి వదిలేశాయి. ఇలాంటి వినియోగం విషయంలో ఇకపై కొంత కఠినంగా వ్యవహరించనున్నారు. తొలుత విస్తృతంగా అవగాహన కల్పించడం.. అవసరాన్ని బట్టి కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇవ్వడం.. అప్పటికీ మార్పు రాకపోతే కేసుల్లో నిందితులుగా చేర్చడంపై దృష్టి సారించనున్నాయి.
గంజాయిని కట్టడి చేస్తే 70-80 శాతం నియంత్రణ
తెలంగాణలో వినియోగంలో ఉన్న మాదకద్రవ్యాల్లో 70-80శాతం వరకు గంజాయి మాత్రమే అనేది దర్యాప్తు సంస్థల మాట. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర మాదకద్రవ్యాలతో పోల్చితే యువత, విద్యార్థులు ఎక్కువగా గంజాయినే వినియోగిస్తున్నారు. ఇది తేలిగ్గానే కాకుండా చవగ్గా దొరుకుతుండటమే ఇందుకు కారణం. డబ్బులు ఎక్కువగా ఉండే వ్యాపారవర్గాలు, సినీప్రముఖులు కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ లాంటి నార్కొటిక్స్ డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారు. కానీ ఇది 10-20శాతం మాత్రమే. గంజాయిని కట్టడి చేస్తే 70-80శాతం నియంత్రణ సాధ్యమని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: CM KCR on Drugs: 'డ్రగ్స్ నియంత్రణలో ఎంతటివారినైనా ఉపేక్షించొద్దు'