భాగ్యనగరంలో ఉన్న ముగ్గురు ఫుడ్ ఇన్స్పెక్టర్లలో రెండు నెలల్లో ఇద్దరు పదవీ విరమణ తీసుకుంటారు. వారి కుర్చీలు ఖాళీ ఐతే ఆహారకల్తీ ముఠాలకు రెక్కలొచ్చినట్లవుతుంది. హోటళ్ల తనిఖీలు, హానికర పదార్థాల విక్రయం, పాలప్యాకెట్ల కల్తీ, పండ్లను రసాయనాలతో మగ్గబెట్టడం, కల్తీనూనె, ఇతరత్రా అనారోగ్యకర పదార్థాలు మార్కెట్‌ను ఆక్రమిస్తాయి. ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుంది.
ముగ్గురు ఉన్నతాధికారులు విధులు నిర్వర్తిస్తున్నా.. నగరంలో కల్తీ దందా యథేచ్ఛగా సాగుతుందని, వారు పదవీ విరమణ తీసుకుంటే పరిస్థితి తీవ్రంగా మారుతుందని పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్కారు యుద్ధప్రాతిపదికన అటకెక్కిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల నియామక ప్రక్రియను పూర్తిచేసి, జీహెచ్‌ఎంసీ ఆహార కల్తీ నియంత్రణ విభాగాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నారు.
కళేబరాలతో నూనె
మహానగరంలో పేరున్న బడా హోటళ్ల నుంచి తోపుడు బండ్ల వరకు చాలా మంది నిర్వాహకులు ఆహార కల్తీకి పాల్పడుతున్నారు. శివారు కేంద్రంగా జంతు కళేబరాలతో నూనె తయారు చేసే కేంద్రాలు నడుస్తున్నాయి. పలు డైరీ సంస్థలు పాలను మలినం చేస్తుండగా, వ్యాపారులు హానికర రసాయనాలతో పండ్లను మగ్గిస్తున్నారు. గుట్కా, ఈ సిగరెట్ల వంటి నిషేధిత వస్తువులు మార్కెట్లో చలామణి అవుతున్నాయి. గొర్రె మాంసంలో గొడ్డు మాంసాన్ని కలిపి విక్రయిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఇటీవల వినిపిస్తున్నాయి. పేరున్న బడా హోటళ్లు రోజుల తరబడి మాంసం వంటకాలను గడ్డకట్టే ఉష్ణోగ్రత ఉండే ఫ్రిడ్జీల్లో నిల్వ చేస్తున్నాయి. హోటళ్లలోని అపరిశుభ్రత వాతావరణంతో బొద్దింకలు, ఇతర కీటకాలు వంటకాల్లో కలిసిపోతున్నాయి. ఆయా అంశాలపై జీహెచ్‌ఎంసీకి నిత్యం ఫిర్యాదులొస్తున్నాయి. అధికారులు పూర్తిస్థాయిలో లేకపోవడంతో సిబ్బంది మెజార్టీ ఫిర్యాదులను బుట్టదాఖలు చేస్తున్నారు.
పురోగతి లేదు..
బల్దియా ఆహారకల్తీ విభాగం నిద్రమత్తులో కూరుకుపోయింది. హోటళ్ల తనిఖీల్లేవు. పలువురు సహాయ వైద్యాధికారులు, ఉపకమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే వచ్చినప్పుడు పారిశుద్ధ్యం కోణంలో తనిఖీలు చేపట్టి, జరిమానాల విధింపుతో సరిపెడతారు. కల్తీ విషయంలో తనిఖీలు చేసి, యజమానులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఎందుకంటే.. వాళ్లకి జరిమాన విధించే అధికారమే ఉంది. ఆహార పదార్థాల నమూనాలు తీసుకుని, పరీక్ష చేయించి, ఫలితాల ఆధారంగా కల్తీరాయుళ్లపై చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు అవసరం. పదార్థాలు హానికరమని ధ్రువీకరించి కేసు నమోదు చేసే అధికారం వాళ్లకు మాత్రమే ఉంటుంది.
ఎన్ని ఫిర్యాదులను పరిష్కరించాలి..?
‘‘ఆహార కల్తీపై రోజూ 50కిపైగా ఫోన్లు వస్తుంటాయి. ఒకరు లింగంపల్లి నుంచి, మరొకరు ఉప్పల్ నుంచి మాట్లాడతారు. ఉన్నది ముగ్గురు ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు. నగరంలోని 30 సర్కిళ్ల పరిధికి పనిచేయాలి. నిబంధనల ప్రకారం సర్కిల్‌కు ఒకరుండాలి. నియామకాల్లేక ఒక్కో అధికారి 10 నుంచి 14 సర్కిళ్లకు పనిచేస్తున్నారు. ఫలితంగా తీవ్రత ఎక్కువ ఉన్న చోట తనిఖీలు చేపడుతున్నాం. ఫిర్యాదు అందిన హోటళ్లు, వస్తు తయారీ కేంద్రాలు, నిషేధిత వస్తువుల విక్రయ కేంద్రాల్లో నమూనాలు తీసుకుని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపిస్తాం. పోలీసులు గుట్కా, ఇతర వస్తువులపై చేపట్టే దాడుల్లో, పశువైద్య విభాగం నిర్వహించే తనిఖీల్లోనూ మేం పాల్గొనాలి. నమూనాలను పరీక్షించే ప్రయోగశాలల నివేదికలను తీసుకోవడం, ఫలితాల ఆధారంగా కేసులు నమోదు చేయడం మా పనే. ఇలాంటి పనులన్నింటినీ చక్కదిద్దడం సమస్యలకు తావిస్తోంది. కల్తీ నియంత్రణపై దృష్టిసారించలేకపోతున్నాం.’’అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.