అంచనాలు, వాస్తవ ఖర్చుకు మధ్య తేడా బాగా తగ్గించేలా బడ్జెట్‌ను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాగ్ స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదంలేని వ్యయాన్ని నియంత్రించడంతో పాటు ఆమోదించిన మొత్తం కంటే ఎక్కువ వెచ్చించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. 2014-15 నుంచి నాలుగేళ్ల పాటు శాసనసభ ఆమోదం లేకుండా చేసిన భారీ వ్యయాన్ని కూడా క్రమబద్ధీకరించుకోలేదని స్పష్టం చేసింది. 2017-18, 2018-19కి సంబంధించి సాధారణ, సామాజిక రంగాలు, రెవెన్యూ, ఆర్థిక ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక స్థితిగతులను విశ్లేషించిన కాగ్ నివేదికను ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చారని.. విద్యకు తగ్గించారని ఆ నివేదికలో కాగ్ పేర్కొంది. ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలల్లోనే 34 శాతం ఖర్చు చేశారని వివరించింది. ఎస్సీ, ఎస్టీ నిధులను కూడా సరిగా ఖర్చుచేయడం లేదని తెలిపింది. రాబోయే ఏడేళ్లలో రూ.76,262 కోట్ల అప్పు తీర్చాల్సి ఉందని విశ్లేషించింది.
ఆర్థిక నిర్వహణకు సంబంధించి కీలకమైన ఆర్థిక అంశాలు నిర్దేశించిన పరిమితుల మేరకే ఉన్నాయంది. 2018-19 సంవత్సరానికి ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం, 14వ ఆర్థిక సంఘం నిర్దేశించిన మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.8,65,688 కోట్లు కాగా ఇందులో ద్రవ్యలోటు గరిష్ఠంగా 3.25 శాతం వరకూ ఉండే అవకాశం ఉందని, బడ్జెట్‌లో ఇది 3.11 శాతంగానే ఉందని వివరించింది. జీఎస్‌డీపీలో రుణ పరిమితి 23.33 శాతం ఉండగా వాస్తవ రుణాలు 22.75 శాతంగా ఉన్నాయంది.
- 2014-15 నుంచి 2017-18 వరకు కేటాయింపులకు మించి ఖర్చు చేసిన రూ.55,517 కోట్లను క్రమబద్ధీకరించలేదు. అధిక వ్యయాల క్రమబద్ధీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- 2018-19లో బడ్జెట్ కేటాయింపులు లేకుండానే రూ.3,707 కోట్లు ఖర్చుచేశారు. ద్రవ్యపాలన, ప్రణాళిక, సర్వేలు, గణాంకాల కోసం ఈ వ్యయాలు చేశారు.
- రాష్ట్ర ప్రభుత్వం కాగ్ అనుమతి పొందకుండా 2018-19లో 18 ఉపపద్దులను ప్రారంభించింది. వీటికి రూ.13,891 కోట్లను కేటాయించి రూ.10,809 కోట్లు ఖర్చుచేశారు.
- 2018-19లో రెవెన్యూ మిగులును రూ.4,337 కోట్లుగా, ద్రవ్యలోటును రూ.26,949 కోట్లుగా చూపారు. తప్పు వర్గీకరణల కారణంగా వీటిని తక్కువగా చూపారు. వాస్తవంగా రెవెన్యూలోటు రూ.5,149 కోట్లు కాగా ద్రవ్యలోటు రూ.27,166 కోట్లు.
పీడీ ఖాతాల నిర్వహణను సమీక్షించాలి
ఆయా శాఖల తరఫున ఖర్చుచేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తిగత డిపాజిట్ అకౌంట్‌లు (పీడీ ఖాతాలు) 182 మాత్రమే ఉన్నాయని ఆర్థికశాఖ పేర్కొంది. వీటిలో కూడా 76 ఖాతాల్లో ఖర్చు జరగలేదు. 40 ఖాతాల్లో జమలు లేవు. మరో 12 ఖాతాల్లో నిల్వలేదని పేర్కొంది. గతంలో అంటే 2017-18లో 28,674 ఖాతాలు ఉండేవి. పీడీ ఖాతా నిర్వహణ అధికారులకు విశిష్ఠ సంఖ్యను కేటాయించకపోవడంతో డ్రాయింగ్ అధికారులు నిర్వహించే అన్ని డిపాజిట్ పద్దులను పీడీ ఖాతాలుగా పరిగణించారు. శాఖలకు కేటాయించిన నిధులు మురిగిపోకుండా ఉండేలా ఆర్థిక సంవత్సరం చివర్లో అంటే మార్చిలో బదిలీ చేస్తున్నారు. 2018 మార్చిలో రూ.3,576 కోట్లు, 2019 మార్చిలో రూ.4,946 కోట్లు పీడీ ఖాతాలకు బదిలీ చేశారు. పీడీ ఖాతాల్లో వినియోగించని నిధులను రద్దు చేయాల్సి ఉన్నా చేయలేదు. ఈ అంశాలపై సమీక్షించాలి.
- 2018-19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 34 శాతం నిధులు ఖర్చయ్యాయి. ఈ ఏడాది రూ.1,61,570 కోట్లు వ్యయం కాగా రూ.55,077 కోట్లు చివరి మూడు నెల\ల్లోనే ఖర్చు చేశారు. రాబడుల్లో కూడా రూ. 50,179 కోట్లు (32.92 శాతం) చివరి మూడు నెలల్లోనే వచ్చాయి.
- రైతుబంధుతో తలసరి ఖర్చులో వ్యవసాయానికి అగ్ర ప్రాధాన్యం దక్కింది. 97.82 శాతం పెరిగింది. వైద్య ఆరోగ్య రంగాలపై ఖర్చు 12.41 శాతం పెరిగింది. రవాణా రంగంలో 14.32 శాతం.. విద్య, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో 6.19 శాతం తగ్గింది. సాగునీటి రంగ పెట్టుబడుల వల్ల వచ్చిన ప్రయోజనాల ఫలితాలను సంకలనం చేయాలి. భవిష్యత్తు పెట్టుబడులకు ఇది మార్గదర్శకంగా ఉంటుంది.
ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చు కావడంలేదు
షెడ్యులు కులాలు, షెడ్యులు తెగల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న నిధులు ఖర్చు కావడంలేదు. 2018-19లో ఎస్సీల అభివృద్ధికి రూ.16,452 కోట్లు, ఎస్టీలకు రూ.9,693 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీలకు కేటాయించిన నిధుల్లో 62 శాతం, ఎస్టీల నిధుల్లో 52 శాతం ఖర్చు చేయలేదు. 2016-17లో ఎస్సీల నిధుల్లో 60శాతం, ఎస్టీల నిధుల్లో 57 శాతం మాత్రమే వ్యయం అయ్యాయి.
- మార్కెట్ రుణాలపై అధికంగా ఆధారపడటంతో వడ్డీల చెల్లింపులు 16 శాతం పెరిగాయి.
- 2019 నాటికి చట్టబద్ధమైన సంస్థలు, ప్రభుత్వ కంపెనీలు, సంయుక్త కంపెనీల్లో రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులు రూ.19,754 కోట్లు. వాటి అప్పులపై 6.93 శాతం వడ్డీ చెల్లిస్తుండగా లభించే ప్రతిఫలం 0.48 శాతంగా మాత్రమే ఉంది.
- రుణాలపై చెల్లిస్తున్న సగటు వడ్డీ 6.39 శాతం కాగా రాష్ట్రం ఇచ్చిన రుణాలు, అడ్వాన్స్‌లపై అందుతున్న వడ్డీ 0.03 శాతం మాత్రమే.
- ప్రభుత్వం ఇచ్చిన పూచీకత్తుల్లో 65 శాతం మిషన్‌భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించినవే.
- రెవెన్యూ రాబడుల్లో వడ్డీల చెల్లింపు క్రమంగా పెరుగుతోంది. రానున్న ఏడేళ్లలో రూ.76,262 కోట్ల అప్పు తీర్చాల్సి ఉంది.
- రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ జరిగి అయిదేళ్లయినా ఏపీ, తెలంగాణ మధ్య ఆస్తులు, రుణ బాధ్యతల పంపకం పూర్తికాలేదు. క్యాపిటల్ పద్దుల్లోని రూ.1,51,349 కోట్లు, రుణాలు, అడ్వాన్స్‌ల్లోని రూ.28,099 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్స్‌ల పద్దుల్లోని రూ.4,474 కోట్లు రెండు రాష్ట్రాల మధ్య పంచాల్సి ఉంది.
- కాగ్ ధ్రువీకరణకు రాష్ట్రంలో 24 సంస్థలు వార్షిక పద్దులను సమర్పించాల్సి ఉన్నా ఒక సంస్థ కూడా ఇవ్వలేదు.
- నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులకు క్యాపిటల్ విభాగానికి బదులు రెవెన్యూ విభాగంలో బడ్జెట్ కేటాయించారు.
మదింపులో అంతరం... వసూళ్లపై ఉదాసీనత
రాష్ట్ర ఖజానాకు రాబడిని తెచ్చే కీలక శాఖలు నిర్దేశించిన మేరకు పన్నులు వసూలు చేయకపోవడంతో పాటు తక్కువ వసూలు చేయడం లాంటి చర్యలతో ఖజానాకు నష్టం జరుగుతోందని కాగ్ విశ్లేషించింది.
- గనులు భూగర్బ వనురుల శాఖకు రావాల్సిన బకాయిలు రూ.593 కోట్లు వసూలు కాలేదు. ఇందులో లీజుకు సంబంధించినవి రూ.120 కోట్లు కాగా, విజిలెన్స్ శాఖ గుర్తించింది రూ.224 కోట్లు. శాఖ అధికారులు చెప్పినవి రూ.155 కోట్లు, రెవెన్యూ రికవరీ చట్టం కింద రావాల్సినవి రూ.94 కోట్లు.
- వాణిజ్య పన్నులశాఖలో వస్తువుల అమ్మకం, రెస్టారెంట్లు, బేకరిలో 14.5 శాతం పన్నుకు బదులు అయిదు శాతం చొప్పున వసూలు చేయడంతో రూ.32.78కోట్ల నష్టం వాటిల్లింది.
- మొబైల్ ఫోన్లపై 14.5 శాతానికి బదులు అయిదు శాతం పన్ను విధించడంతో రూ.43.89 కోట్లు తక్కువ వసూలైంది.
- సరైన పత్రాలు లేకున్నా పన్ను మినహాయింపు ఇవ్వడంతో రూ.41.32 కోట్లు, అమ్మకాల టర్నోవర్‌లో అంతరాలతో రూ.73.56 కోట్ల నష్టం.
- జరిమానా తక్కువ విధించడంతో రూ.30.72 కోట్ల నష్టం వచ్చింది.
- జీహెచ్‌ఎంసీ పరిధిలో మద్యం దుకాణాలు, బార్ల నుంచి రూ.2.7 కోట్ల పన్ను తక్కువ వసూలు.
- తనఖా సంస్థల రుణాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు తక్కువ వసూలుతో రూ.4.85 కోట్ల నష్టం.
ఇదీ చదవండి: ఎట్టిపరిస్థితుల్లో తెలంగాణలో లాక్‌డౌన్ విధించం: కేసీఆర్