రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ అత్యవసరంగా సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. పాజిటివ్ కేసులు, రికవరీ తదితర అంశాలపై సమీక్షించనుంది. కొవిడ్ నియంత్రణా చర్యల్లో భాగంగా.. రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో తదుపరి కార్యాచరణ విషయమై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఉద్ధృతి తగ్గి రికవరీ రేటు పెరిగిన నేపథ్యంలో.. లాక్ డౌన్ ఆంక్షలను సడలించే అవకాశం కనిపిస్తోంది. కేవలం రాత్రి పూట కర్ఫ్యూ ఉండవచ్చని అంటున్నారు. సినిమాహాళ్లు, బార్లు, వినోద సంబంధిత వాటిపై ఆంక్షలు కొనసాగిస్తూ మిగతా వాటికి మినహాయింపులు ఇవ్వవచ్చని సమాచారం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ సమావేశంలో... ఓ నిర్ణయానికి రానున్నారు.
వర్షాలు, వానాకాలం పంటలసాగు, ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం పెంపు, గోదావరి నుంచి నీటి ఎత్తిపోతపై సమావేశంలో చర్చిస్తారు. జల విద్యుత్ ఉత్పత్తిపై కూడా కేబినెట్‌లో కీలక చర్చ జరగనుంది. కృష్ణానదిపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, తుంగభద్ర నదిపై ఆర్డీఎస్ వద్ద కుడికాలువ నిర్మాణం అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. శుక్రవారం మంత్రులతో సీఎం కేసీఆర్ సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో.. రాజీ పడబోమని, రాష్ట్రానికి రావాల్సిన వాటాలో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదని, ఆ దిశగా కార్యాచరణ ఉంటుందని సీఎం అన్నట్లు సమాచారం.
రేపట్నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టనున్న జిల్లాల పర్యటనల అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కలెక్టరేట్ల ప్రారంభోత్సవంతో పాటు.. పల్లె, పట్టణ ప్రగతి పనుల పురోగతిని ఆకస్మికంగా తనిఖీ చేస్తానని సీఎం ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ విషయంలో మంత్రులు, అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఇంటర్ ఫలితాలు, పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగు తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు ఇతర రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. హుజురాబాద్ స్థానం ఖాళీ అయిన నేపథ్యంలో ఉపఎన్నిక దిశగా పార్టీని, శ్రేణులను సమాయత్తం చేయడం, అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించే అవకాశం ఉంది.