రాష్ట్రంలో మూడో వంతు భవన నిర్మాణాలు హైదరాబాద్ చుట్టుపక్కలే జరుగుతున్నాయి. రాష్ట్రంలో టీఎస్‌బీపాస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి గత నెల వరకు పురపాలకశాఖ ఇచ్చిన అనుమతులు, వచ్చిన దరఖాస్తులను విశ్లేషిస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని నగరపాలక సంస్థలు, పురపాలకసంఘాల్లో నిర్మాణాల జోరు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధిక సంఖ్యలో భవనాలకు అనుమతి లభించింది. 500 చదరపు గజాలు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో భవనాల్లోనూ జీహెచ్‌ఎంసీ మొదటి స్థానంలో ఉండగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రెండో స్థానంలో ఉంది.
500 గజాల్లోపు భవన నిర్మాణాలకు రాష్ట్ర వ్యాప్తంగా 80,460 అనుమతులు ఇవ్వగా అందులో 34,171... ఐదొందల గజాలకంటే ఎక్కువ విస్తీర్ణంలో భవనాలకు 7,909 దరఖాస్తులు రాగా అందులో 5,623 హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. రాష్ట్రంలో మూడోవంతుపైగా భవన నిర్మాణాలు ఈ మూడు జిల్లాల పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనే జరుగుతున్నాయి. లేఅవుట్ల అనుమతి కోసం రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు రాగా, తర్వాత స్థానంలో సంగారెడ్డి జిల్లా, హనుమకొండ, జీహెచ్‌ఎంసీ, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి.
ఈ పట్టణాల్లో అత్యధికం... జీహెచ్‌ఎంసీ సహా హైదరాబాద్‌కు అనుబంధంగా ఉన్న బోడుప్పల్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్‌పేట, తుర్కయాంజాల్, నాగారం, దుండిగల్ పురపాలక సంఘాల పరిధిలో పెద్ద సంఖ్యలో నిర్మాణాలు జరుగుతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లకంటే జిల్లా కేంద్రమైన కామారెడ్డిలో భవన నిర్మాణ అనుమతులు ఎక్కువ ఉండడం గమనార్హం. దమ్మాయిగూడ, దుండిగల్, ఖమ్మం కార్పొరేషన్ సహా జిల్లా కేంద్రాలైన సిద్దిపేట, సూర్యాపేట, ఆదిలాబాద్, జగిత్యాల, గద్వాల, జనగామతో పాటు షాద్‌నగర్, అమీన్‌పూర్, బండ్లగూడ జాగీర్, పోచారం పురపాలకసంఘాల్లో భవన నిర్మాణాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి.