BSC NURSING : రాష్ట్రంలో బీఎస్‌సీ నర్సింగ్ సీట్లను వచ్చే విద్యాసంవత్సరం(2022-23) ఎంసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్ మార్కులను బట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లను కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం భర్తీ చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం(2021-22) నుంచి నీట్ ఆధారంగా నర్సింగ్ సీట్లు కేటాయించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీనిద్వారా కాకున్నా ఏదో ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లను భర్తీ చేయాలని భారతీయ నర్సింగ్ మండలి(ఐఎన్‌సీ) రాష్ట్రాలను ఆదేశించింది. కానీ ఇందుకు ఈఏడాదికి కాళోజీ వర్సిటీ మినహాయింపు పొందింది. ప్రస్తుత సంవత్సరానికి ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు జరుపుతోంది. ఈక్రమంలో ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేయాలని భావిస్తోంది.
BSC NURSING Seats : ఇటీవల రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఆ వర్సిటీ ఉపకులపతి బి.కరుణాకర్‌రెడ్డి దీన్ని ప్రతిపాదించారు. త్వరలో రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్, ఆయా కళాశాలల యాజమాన్యాలతో మాట్లాడి నీట్, ఎంసెట్‌లలో.. దేని ర్యాంకు ఆధారంగా నర్సింగ్ సీట్లను భర్తీ చేయాలన్న దానిపై అభిప్రాయాలను తీసుకుంటామని కాళోజీ వర్సిటీ ఉపకులపతి కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఎంసెట్ అయితే మన విద్యార్థులకు అనుగుణంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. లిఖితపూర్వకంగా ప్రతిపాదన పంపిస్తే ప్రభుత్వంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి చెప్పినట్లు సమాచారం. కాగా రాష్ట్రంలోని 87 నర్సింగ్ కళాశాలల్లో, సుమారు 5 వేల వరకు సీట్లున్నాయి.
ఇదీచూడండి: ఉద్యోగుల బదలాయింపునకు రంగం సిద్ధం.. 22 నుంచి ఉత్తర్వులు