Bread Festival in Nellore : మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండగ ఏపీలోని నెల్లూరులో ఘనంగా సాగుతోంది. మంగళవారం నుంచి అయిదు రోజుల పాటు దీన్ని నిర్వహించనుండగా.. ఇప్పటికే పెద్దఎత్తున భక్తులు పోటెత్తారు. రెండేళ్లుగా కొవిడ్ నేపథ్యంలో పరిమితులతో పండగ నిర్వహించగా.. ఈసారి ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. బారాషహీద్ దర్గాను, స్వర్ణాల చెరువును విద్యుద్దీపాలతో అలంకరించారు. సుమారు 15 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కోరికలకు అనుగుణంగా దర్గా ఆవరణలోని స్వర్ణాల చెరువులో స్నానం చేసి.. రొట్టె తీసుకుంటే నెరవేరుతుందన్నది భక్తుల విశ్వాసం.
అయిదు రోజులపాటు: ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకు రొట్టెల పండగ నిర్వహించాలని ముస్లిం పెద్దలు నిర్ణయించారు. ఆ మేరకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
9న సొందల్ మాలీతో మొదలై.. 10న గంధోత్సవం(జియారత్), 11 రొట్టెల పండగ, 12న తహనీల్ ఫాతెహా జరుగుతుంది. 13వ తేదీతో కార్యక్రమాలు ముగుస్తాయి. ఇందులో 10, 11 తేదీల్లో జరిగేవి విశేషమైనవి. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని కలుపుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. అక్కడ కడప దర్గా పీఠాధిపతి ఆరీఫ్ ఉల్లా ఉసేనీ చేతుల మీదుగా ప్రార్థనలతో అమరవీరుల సమాధులకు లేపనం చేస్తారు. దీన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తారు.
ఏటా పెరుగుతున్న భక్తుల రాక: సంపద కావాలనుకునే వారికి ఒక రొట్టె.. చదువు.. ఉద్యోగం.. సొంత ఇల్లు.. ఆరోగ్యం.. వివాహం.. ఇలా ఎవరి కోరికలకు అనుగుణంగా ఇక్కడ రొట్టె తీసుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. ఒక ఏడాది ఇక్కడకు వచ్చి రొట్టె తీసుకుని.. కోరిక తీరిన తర్వాత.. కచ్చితంగా వచ్చి మళ్లీ రొట్టె విడిచి వెళ్లాలన్నది ఆచారం. దీంతో ఒకసారి ఇక్కడకు వచ్చిన భక్తులు మళ్లీ కచ్చితంగా రావాల్సి ఉంటుంది.
పటిష్ఠ ఏర్పాట్లు: స్వర్ణాల చెరువులో పుష్కర ఘాట్‌ను, దాన్ని ఆనుకుని జల్లు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. స్నానానంతరం దుస్తులు మార్చుకోవడానికి వీలుగా ప్రత్యేక పందిర్లు, దర్గా ఆవరణలో పలు చోట్ల తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. దర్గా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమేరాలు, డ్రోన్ల సాయంతో బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. మొత్తం రెండు వేల మంది పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
దర్గా అభివృద్ధికి రూ.15కోట్లు: నెల్లూరు బారాషహీద్ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర పండగగా గుర్తించిన నేపథ్యంలో అభివృద్ధి పనులకు రూ. 15కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మంజూరైన నిధుల్లో మసీదు నిర్మాణానికి రూ. 7.5కోట్లు, దర్గా అభివృద్ధి, అంతర్గత రోడ్ల నిర్మాణానికి రూ. 7.5 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. వచ్చే ఏడాది రొట్టెల పండగ నాటికి నిర్మాణాలు పూర్తి చేసేలా కృషి చేస్తామన్నారు.
అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు : ఎస్పీ
నెల్లూరులో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న బారా షహీద్ రొట్టెల పండుగకు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సీహెచ్ విజయరావు అన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక పోలీసు కవాతు మైదానంలో సిబ్బందికి ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు నిర్ణయించిన విధులకు ప్రతిఒక్కరూ హాజరు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు.
జిల్లా కీర్తి పెరిగేలా ఏర్పాట్లు: మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి
జిల్లా కీర్తి ప్రతిష్ఠలు పెరిగేలా బారాషహీద్ దర్గా రొట్టెల పండగకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ చక్రధర్‌బాబు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి దర్గాలో పండగ ఏర్పాట్లపై సమీక్షించారు. పటిష్ఠ భద్రతతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలన్నారు. బారాషహీద్ దర్గాలో మసీదు నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారులకు సూచనలు చేశారు. ఎస్పీ విజయరావు, జేసీ కూర్మనాథ్, మేయర్ స్రవంతి, కమిషనర్ హరిత, నెల్లూరు ఆర్డీవో మాలోల, మైనార్టీ సంక్షేమాధికారి కనకదుర్గా భవాని, దర్గా కమిటీ ఛైర్మన్ షాజహాన్, వైస్ ఛైర్మన్ ఖాదర్‌బాషా, నెల్లూరు రూరల్ తహసీల్దారు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.