బీసీల ఐక్యతకు బీపీ మండల్ చేసిన కృషి చిరస్మరణీయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. బీసీ వర్గాలకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ 102వ జయంతి వేడుకలు నిర్వహించారు. బీపీ మండల్ చిత్రపటానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెతెదేపా అధ్యక్షుడు ఎల్ రమణ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలు వేసి నివాళులు అర్పించారు.
బీపీ మండల్ అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రిగా పని చేశారని మంత్రి గుర్తు చేశారు. నాడు అనేక ఇబ్బందులు, అవమానాలను ఎదుర్కొని బీసీల రిజర్వేషన్‌కై పోరాటం చేశారన్నారు. బీసీలను నిర్లక్ష్యం చేస్తే ఏ రాజకీయ పార్టీ మనుగడ సాధించలేదని ఎల్ రమణ అన్నారు. ఎవరు ఓటు వేస్తే అధికారంలోకి వచ్చాం... పాలిస్తున్నామో ప్రభుత్వం ఆలోచించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. దేశంలో మెజారిటీ ప్రజలను బీసీలను అన్ని ప్రభుత్వాలు అణచివేస్తున్నాయని విమర్శించారు. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం విచారకరమన్నారు.