Black Chain Technology : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్, రోబోటిక్ తదితర టెక్నాలజీలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇదే సమయంలో..వాటికి భద్రత కల్పించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ తెరపైకి వచ్చింది. చేసే ప్రతి పని ఇంటర్నెట్‌తో ముడిపడి ఉండటంతో.. సైబర్ నేరాల తగ్గింపునకు ఇది అడ్డుకట్ట వేస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖంగా ఐటీలో ఉపయోగించే ఈ టెక్నాలజీ తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, అనుబంధ ఉద్యాన, పాడి, మాంసం వంటి రంగాల్లోకి అడుగుపెట్టింది. ఈ మధ్య కాలంలో.. దేశంలో సేంద్రీయ ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మనం తీసుకునే పదార్థాలు నిజంగానే సేంద్రీయ ఉత్పత్తులో కాదో తెలుసుకునేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించవచ్చు అంటున్నారు ఐటీ రంగ నిపుణులు.
అసలేంటి బ్లాక్‌చైన్ టెక్నాలజీ?
Black Chain Technology in Agriculture Farm : విలువైన, రహస్య సమాచారం వివిధ ప్రాంతాల్లో భద్రపరిచి ఇతరులు తస్కరించకుండా ఒకదానితో మరొకటి అనుసంధానించి దానికి సాంకేతిక భద్రత కల్పించమే బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఈ విధానంలో డేటా నింపే ఆపరేటర్లకు ఒక రహస్య పాస్‌వర్డ్ అందిస్తారు. క్షణాల్లో ప్రవేశించి సమాచారం నమోదు చేయాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌లోకి పాస్‌వర్డ్ కలిగిన వ్యక్తులు మాత్రమే ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. వీరు తప్ప మరొకరు ప్రవేశించడానికి ప్రయత్నిస్తే మిగిలిన వారికి ఈ సమాచారం క్షణాల్లో తెలిసిపోతుంది. ఇందులో డేటా భద్రపరిచే ప్రాంతాలను నోడ్స్ అని పాస్‌వర్డ్‌ను హాష్‌కీ పిలుస్తారు. డేటాను క్రిప్టాలజీ విధానం ద్వారా కోడ్స్‌లోకి మార్చి భద్రపరుస్తారు.
ఆర్గానిక్ ఫుడ్‌ని ఎలా గుర్తించాలి..
Black Chain Technology detects Organic Products : కొవిడ్ కారణంగా జనాల్లో ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలపై అవగాహన పెరిగింది. దీనిని ఆసరాగా తీసుకుని చాలా మంది పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం ఇలా అన్నీ కూడా సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేశామంటూ నాసిరకంవి అంటగడుతున్నారు. ఈ తరుణంలో ఫలానా పంట ఏ ఊరులో సాగు చేశారు..? ఎలాంటి ఎరువులు ఉపయోగించారు..? ఎప్పుడు హార్వెస్టింగ్ చేశారు? ఎన్ని రోజులు నిల్వ ఉంది? వంటివి తెలుసుకునేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగించవచ్చు. ఈ దిశగా.. టెక్ మహీంద్రా వంటి దిగ్గజ సంస్థలే కాకుండా.. ట్రేయంభు టెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ - టీఆర్‌ఎస్‌టీ 01 వంటి స్టార్టప్స్ కృషి చేస్తున్నాయి.
పంచరతన్ క్షేత్రంలో బ్లాక్‌చైన్..
Black Chain Technology in Pancharatan Farm :రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మల్కారంలో "పంచరతన్" సేంద్రీయ క్షేత్రంలో బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగానికి శ్రీకారం చుట్టారు. పంటల సాగు సంబంధించి గింజ విత్తడం, నర్సరీ, తేదీలతో పాటు పండ్లు, కూరగాయల ఉత్పత్తుల కోత, పాలు పితకడం, ప్యాకింగ్, నిల్వ, పండ్ల రుచి, కూరగాయల్లో సూక్ష్మపోషకాలు వంటికి ట్యాగింగ్ చేయనున్నారు. ఇందుకోసం.. టీఆర్‌ఎస్‌టీ01 స్టార్టప్ ఓ మొబైల్ అప్లికేషన్ ఆవిష్కరించింది. ఈ టెక్నాలజీ వల్ల దళారుల బెడద లేకుండా రైతులకు మంచి లాభాలు రావడంతో పాటు వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులు పొందవచ్చు.
ఎలా ఉపయోగపడుతుందంటే..
Pancharatan Farm in Rangareddy :విశ్వనగరమైన హైదరాబాద్‌లో కోటికి పైగా జనాభా ఉండటంతో..క్రమంగా ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, ఇతర ఉత్పత్తులకు భారీగా డిమాండ్ నెలకొంది. దీనిని అందిపుచ్చుకునేందుకు.. నగర శివార్లలో కొందరు రైతులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వ్యాపార సరళిలో సమగ్ర వ్యవసాయం చేస్తున్నారు. స్వయంగా మార్కెటింగ్ అవకాశాలు సృష్టించుకుని నేరుగా వినియోగదారులకు చేరవవుతున్నారు. ఐతే.. కొందరు చేసే మోసాల వల్ల వీరి వ్యాపారంపై ప్రభావం పడుతోంది. ఈ తరుణంలో.. సేంద్రీయ పద్ధతుల్లో పదార్థాలు తయారు చేసేందుకు తామేం చేశామో వినియోగదారులకు తెలియజేసేందుకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.
బ్లాక్‌చైన్ టెక్నాలజీకి భారీ డిమాండ్..
Demand for Black Chain Technology : అన్ని రంగాల్లో క్రీయాశీలకపాత్ర పోషిస్తున్న బ్లాక్‌చైన్ టెక్నాలజీకి త్వరలోనే భారీగా డిమాండ్ ఏర్పడనుంది. దీనిని ఉపాధిగా మలిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఐసీఏఆర్, అనుబంధ పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు సన్నద్ధమవుతున్నాయి. ప్రపంచ ఆహార పురస్కార గ్రహీత డాక్టర్ రతన్‌లాల్ నినాదం అనుగుణంగా ఆరోగ్యకర నేలలు.. ఆరోగ్యకర పంటలు..ఆరోగ్యవంతులైన ప్రజలు.. ఆరోగ్యకర భూగోళం.. అనడానికి ఇదొక నమూనాగా ఈ క్షేత్రాన్ని అభివర్ణించవచ్చు. దీని ఫలితాలు చూసిన తరువాత.. ఇలాంటి మరిన్ని క్షేత్రాలు అందుబాటులోకి వచ్చినట్లయితే జంట నగరవాసులకు అత్యుత్తమైన సేంద్రీయ ఉత్పత్తులు అందించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు..
మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ అవ్వాల్సిన పరిస్థితులు వ్యవసాయ రంగంలోనూ నెలకొన్నాయి. అగ్రీకల్చర్ విద్యార్థులు నాణ్యమైన ఆహార పదార్థాలు ఎలా పండించాలి అనే దానిపైనే కాకుండా.. వాటి మార్కెటింగ్‌లోనూ నైపుణ్యాలు పెంపొదించుకోవాలి. మరీ ముఖ్యంగా.. బ్లాక్‌చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో..రైతులు అధిక దిగుబడులు సాధించేలా కృషి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం.. తక్కువ క్షేత్రాల్లో ఉపయోగిస్తున్న బ్లాక్‌చైన్ టెక్నాలజీ విరివిగా అందుబాటులోకి వస్తే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. పంటకు సంబంధించిన డేటా అంతా వినియోగదారుల చేతుల్లో ఉంటుదంటున్నారు నిపుణులు.