అధిక ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముట్టడికి యత్నించింది. ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడం వల్ల రోడ్డుపై బైఠాయించారు.
పోలీసులు, బీజేవైఎం కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలతో ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. కార్పొరేట్ కళాశాలల్లో అధిక ఫీజులను అరికట్టాలని, తొలగించిన కార్పొరేట్ కళాశాలల అధ్యాపకులను విధుల్లోకి తీసుకునేలా ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకోవాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది.