Bandi Sanjay News : ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అధికార తెరాస బద్నాం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో భాజపా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. కమలం పార్జీ జెండాను ఎగురవేశారు. సిద్ధాంతాల పునాదుల మీద పనిచేసే పార్టీలకే దేశంలో మనుగడ ఉందని స్పష్టం చేశారు.
BJP Formation Day 2022 : భారత్‌ను ప్రపంచంలోనే విశ్వగురువు స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్న భాజపాను.. రాష్ట్రంలోనూ అధికారంలోకి తెచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. తెలంగాణ సర్కార్ అటు విద్యుత్ ఛార్జీలు.. ఇటు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తోందని విమర్శించారు.
"సీఎం కేసీఆర్.. భాజపాను కేంద్ర సర్కార్‌ను అప్రతిష్ట పాలుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెంచి రైతులను మోసం చేస్తున్నారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను మోసం చేసేందుకు కుట్ర పన్నారు. ఎలాంటి ఎన్నికలు వచ్చినా.. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరేలా కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలి."
- బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
- ఇదీ చదవండి : మోదీతో గవర్నర్ తమిళిసై సమావేశం... ఆ విషయాలపై చర్చ!!