హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస అప్రజాస్వామికంగా వ్యవహారించి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వ్యవహారించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తెరాస ఎంత డబ్బు ఖర్చు పెట్టినా.. ఇంకెన్ని ప్రలోభాలకు గురిచేసినా.. ప్రజలు నిష్పక్షపాతంగా న్యాయం, ధర్మం వైపు నిలిచారని పేర్కొన్నారు. తెరాస విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. అధికార యంత్రాంగంతో భాజపాపై ఎంత ఒత్తిడి తీసుకువచ్చినా.. తమ కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. విజయం కోసం కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగిన పోటీలో ప్రజలు మంచి ఆలోచనతో భాజపాను ఆదరించారని సంజయ్ వివరించారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ఓటింగ్‌లో పాల్గొన్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీశ్రేణుల నుంచి అందిన సమాచారం ప్రకారం భాజపా భారీ మెజార్టీతో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
86.33 శాతం పోలింగ్..
చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు మినహా హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సుమారు 12 గంటల పాటు పోలింగ్ సాగింది. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో క్యూలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. సాయంత్రం 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్ నమోదయింది. హుజూరాబాద్‌లో 2018 ఎన్నికల్లో 84.5 శాతం పోలింగ్ నమోదవ్వగా.. ఈసారి దానికి మించి ఓటింగ్ జరిగింది. నవంబర్ 2న ఉపఎన్నికల ఓట్ల లెక్కించనున్నారు.
ఇదీ చూడండి: