దుబ్బాకలో భాజపా విజయం పట్ల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. దుబ్బాక ప్రజలు భాజపాకు స్ఫూర్తిదాయక విజయం అందించారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దుబ్బాక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా... భరించి దుబ్బాక ఓటర్ల చైతన్యం, నిజాయితీ, నిబద్ధతతో విజయం సాధించామన్నారు.
అభివృద్ధి నిధులతో తెరాస నాయకులు జేబులు నింపుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అధికార పార్టీకి ఓటేస్తేనే అభివృద్ధి జరుగుతుందని మోసపూరిత మాటలు చెప్పారని ఎద్దేవా చేశారు. కానీ ఎవరు వాస్తవాలు చెప్పారో ప్రజలు నిర్ణయించారని స్పష్టం చేశారు. ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని... రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు.
తెరాసకు గుణపాఠం..
దుబ్బాక ప్రజలు భాజపాకు కట్టబెట్టిన విజయంతో ప్రతి గ్రామంలో సంబురాలు చేసుకుంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక మాదిరిగా ఎక్కడా అధికార దుర్వినియోగం జరగలేదని ఆరోపించారు. బిహార్ వంటి రాష్ట్రంలో శాంతియుతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగాయన్నారు. అధికారులు కూడా పక్షపాతంగా వ్యవహరించారని విమర్శించారు.
భాజపా అభ్యర్థి కుటుంబసభ్యులను వేధించారు, మామ ఇంటిపై దాడులు చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. ప్రచారానికి వెళ్తే అడుగడుగునా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు, అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. భాజపాను గెలిపించి తెరాసకు గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో భాజపాను చేరదీసినట్టే... దేశవ్యాప్తంగా ఆశీర్వదించారని అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి: ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉపపోరు లెక్కింపు..