దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థి రఘునందన్ రావు చారిత్రాత్మక, సంచలన విజయం సాధించారని ఆ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప ఎన్నికల ఫలితాల పట్ల ఆయన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ... రఘునందన్ రావుకు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారానికి, అహంభావానికి ఈ తీర్పు చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో భాజపా అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ ఫలితం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలపై ప్రభావం చూపుతుందని పొంగులేటి స్పష్టం చేశారు. త్వరలో జరిగే గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో రాష్ట్ర నాయకత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి: దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయం