కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగరరావు అయోధ్యలోని రామమందిర నిర్మాణ నిధి సేకరణపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ భాజపా శ్రేణులు నిరసన చేపట్టాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని ఆయన ఇంటిని ముట్టడిస్తారనే ప్రచారంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు... రాష్ట్రవ్యాప్తంగా భాజపాతోపాటు ఆ పార్టీ అనుబంధం సంఘాలు నిరసనలు చేపట్టాయి. హైదరాబాద్ బషీర్‌బాగ్ కూడలి, సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేటలో ఆందోళన చేపట్టిన భాజపా శ్రేణులు.. విద్యాసాగర్‌రావు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కోఠిలో భజరంగ్‌దళ్, లంగర్‌హౌస్, అంబర్‌పేట్‌లో భాజపా శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సాగర్ రహదారిపై భాజపా, హిందూవాహిని సంఘాల కార్యకర్తలు బైఠాయించారు.
ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు ప్రజలకు క్షమాపణ చెప్పాలని కరీంనగర్‌లో భాజపా నేతలు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా విద్యాసాగర్ సొంత నియోజకవర్గం కోరుట్ల పరిధిలోని పలు గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. నిజామాబాద్‌లో నిరసన చేపట్టిన భాజపా శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంలో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. బాల్కొండ, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో విద్యాసాగర్‌పై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని నినదించారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి, కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో భాజపా శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన విద్యాసాగర్‌పై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్‌లో భాజపా నేతలు డిమాండ్ చేశారు.
విద్యాసాగర్‌రావు తెరాస నుంచి భర్తరఫ్ చేయాలని నల్గొండ జిల్లా హాలియాలో భాజపా నేతలు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ చౌరస్తాలో తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెదక్‌లోనూ భాజపా శ్రేణులు నిరసన చేపట్టాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పందిళ్లలో రాస్తారోకో చేపట్టారు.
ఇదీ చూడండి: ఫ్లెక్సీ వివాదం: తెరాస, కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తల బాహాబాహీ