వానాకాలంలో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ..... రాష్ట్రవ్యాప్తంగా భాజపా ధర్నాలు(BJP protest over paddy purchase) చేపట్టింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోలు చేయడం లేదని శ్రేణులు నిరసన ప్రదర్శన చేపట్టాయి. తెరాస సర్కారు ధాన్యం కొనుగోలు చేయలేక కేంద్రప్రభుత్వంపై నెపం నెడుతోందని కాషాయ నేతలు విమర్శించారు. వడ్లు కొనుగోళ్లు చేపట్టే వరకు ప్రభుత్వంపై... ఒత్తిడి తీసుకొస్తామని స్పష్టంచేశారు. కలెక్టరేట్ల వద్ద జరిగే ఆందోళనలు విజయవంతమయ్యేందుకు జిల్లాల బాధ్యులు కృషి చేయాలని ఇప్పటికే రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేశారు.
పోరాటం ఆగదు..
ధాన్యం కొనుగోలుకు కేంద్రం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకుండా రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తోందని కమలం నేతలు(Bjp accuses telangana government) ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు తెరాస నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనాల్సిందేనని.. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
కలెక్టరేట్ ముట్టడికి యత్నం...
కేసీఆర్ సర్కార్ వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లాలో కాషాయశ్రేణులు(BJP protest over paddy purchase) ఆందోళనకు దిగాయి. జిల్లా కలెక్టరేట్ వద్దకు భారీగా తరలివచ్చిన భాజపా శ్రేణులు.. రాస్తారోకో నిర్వహించాయి. తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కలెక్టరేట్లోకి దూసుకెళ్లేందుకు భాజపా నేతలు ప్రయత్నించారు. జిల్లా భాజపా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషాతో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ధాన్యం కొనుగోలు చేయాల్సిందే..
హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద భాజపా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా(BJP Dharna over paddy purchase) నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వానకాలం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నాలో ఉద్రిక్తత..
సిరిసిల్లలో భాజపా శ్రేణులు చేపట్టిన ధర్నా(BJP protest over paddy purchase).. ఉద్రిక్తతకు దారి తీసింది. వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాషాయ శ్రేణులు తెరాస సర్కార్, ముఖ్యమంత్రి కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన తెరాస కార్యకర్తలు.. భాజపా శ్రేణులతో వాగ్వాదానికి దిగాయి. ఈ వాగ్వాదం ఘర్షణకు దారితీయడం వల్ల ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
భువనగిరిలో భాజపా ఆందోళన..
రైతుల పట్ల రాష్ట్ర సర్కార్ నిరంకుశ వైఖరి నశించాలని నినాదాలు చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ వద్ద భాజపా శ్రేణులు(BJP protest in yadadri district) నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లోకి వెళ్లడానికి ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కాషాయ శ్రేణులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. భాజపా నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు.
స్వల్ప తోపులాట
వరి ధాన్యం కొనుగోలు చేయాలంటూ జగిత్యాల కలెక్టరేట్(BJP protest in jagtial district) ముందు భాజపా శ్రేణులు ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కాషాయ నేతలు ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా పోలీసులకు భాజపా నాయకులకు తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు.
తెరాస రియాక్షన్..
రాష్ట్రవ్యాప్తంగా భాజపా ధర్నాలు(BJP protest over paddy purchase) చేస్తున్న తరుణంలో.. తెరాస నేతలు(TRS leaders reaction on BJP protest) ధాన్యం కొనుగోళ్లపై స్పందించారు. భాజపా ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తోందని.. పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. రైతుల పక్షాన భాజపా నేతలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిరంతరం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 3,500 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు.