BJP on electricity charges hike: విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. సమర భేరీ మోగించేందుకు భాజపా సిద్ధమైంది. ఛార్జీల పెంపుపై ప్రజా బ్యాలెట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని నిర్ణయించింది. రేపు బషీర్‌బాగ్‌లో ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు భాజపా వెల్లడించింది. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేయనున్నట్లు తెలిపారు. ధర్నాలు ఆందోళనలతో ఛార్జీల పెంపును ఉపసంహరించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు.
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసు కాల్పులు జరిగిన బషీర్బాగ్ నుంచే ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని తెలిపారు. బషీర్బాగ్ ప్రాంతంలో బ్యాలెట్ బాక్సులు ఏర్పాటుచేసి.. ప్రజల నుంచి అభిప్రాయాలు కోరాలని నిర్ణయించినట్లు భాజపా నేతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి సికింద్రాబాద్, గోల్కొండ గోషామహల్, భాగ్యనగర్ మలక్పేట్, మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ 8 జిల్లాల అధ్యక్షులతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ‘ప్రజా బ్యాలెట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇదీచూడండి: రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు... ఏప్రిల్ 1 నుంచి అమలు