తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదో కేసీఆర్ చెప్పాలని భాజపా(BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. 1948 సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలకు అసలైన స్వాతంత్య్రం వచ్చిన రోజు అని చెప్పారు. 1998 నుంచి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని భాజపా డిమాండ్ చేస్తోందని గుర్తు చేశారు. 80వేల పుస్తకాలు చదివిన కేసీఆర్‌కు రజాకార్లు ఏ విధంగా దాడి చేశారో తెలియదా.. 80వేల పుస్తకాల్లో ఆ పుస్తకం లేదా అంటూ ప్రశ్నించారు. లేకుంటే తను పంపిస్తా చదువుకో అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీసు చర్య ద్వారా తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించారని గుర్తు చేశారు.
ఈనెల 17న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారని తెలిపారు. నిర్మల్‌లో జరిగే తెలంగాణ విమోచన సభలో షా పాల్గొంటారని చెప్పారు. నిర్మల్‌లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని కార్యకర్తలను కోరారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ దినోత్సవం మోదీ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మోదీ చరిత్రపై ఫొటో ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తామని చెప్పారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7వరకు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలను మజ్లీస్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్.. ఎంఐఎం చెప్పినట్లే నడుచుకుంటున్నారని విమర్శించారు.
తెలంగాణ ప్రజలందరికీ అసలైన విమోచనం, అసలైన స్వతంత్య్రం సెప్టెంబర్ 17, 1948 వచ్చింది. సెప్టెంబర్ 17ను అధికారంగా నిర్వహించాలని భాజపా 1997 నుంచి డిమాండ్ చేస్తోంది. కేసీఆర్ తెరాస పార్టీ పెట్టకముందు ఆయన తెదేపాలో మంత్రి ఉన్నప్పట్నుంచి భాజపా డిమాండ్ చేస్తూనే ఉంది. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈరోజు మాట తప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారు.
-డీకే. అరుణ, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు
ఇదీ చదవండి: ముమైత్‌ఖాన్‌ను 6 గంటలపాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు