JP Nadda: హైదరాబాద్ పర్యటనలో ఉన్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సికింద్రాబాద్‌లోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. జేపీ నడ్డా వెంట కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు ఉన్నారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా నడ్డా సహా భాజపా నేతలు నల్ల మాస్కులు ధరించారు. గాంధీ విగ్రహం వద్దకు భారీగా భాజపా శ్రేణులు తరలివచ్చాయి. పోలీసులు భారీగా మోహరించారు.
గాంధీ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం.. సత్యాగ్రహం పూర్తయినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం సాగిద్దామన్న లక్ష్మణ్.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ ఇక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. 14 రోజులు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పారు. నిరంకుశ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని సూచించారు. అనంతరం రాణిగంజ్ కూడలి వరకు భాజపా శ్రేణుల ర్యాలీ చేశారు. భాజపా శ్రేణులను అనుసరిస్తూ నడ్డా కాన్వాయ్ ముందుకు సాగింది. అనంతరం అక్కడ నుంచి నాంపల్లి భాజపా కార్యాలయానికి జేపీ నడ్డా, నేతలంతా బయలుదేరి చేరుకున్నారు. అక్కడ మీడియా సమావేశం అనంతరం.. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్ తారామతిపేటలోని నల్లు ఇంద్రసేనా రెడ్డి అతిథిగృహంలో జేపీ నడ్డా రాత్రి బస చేయనున్నారు.
నాలుగురోజుల పర్యటనకు నడ్డా..
ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాల కోసం నాలుగు రోజుల పర్యటనకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయంలో నడ్డాకు.. ఆ పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, విజయశాంతి, రాంచందర్‌రావు సహా ఇతర నేతలు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బండి సంజయ్ అరెస్ట్, అందుకు నిరసనగా భాజపా ర్యాలీ వంటి అంశాలపై విమానాశ్రయంలోనే పార్టీ నేతలతో జేపీ నడ్డా భేటీ అయ్యారు. భేటీలో భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డి, విజయ శాంతి, రామచంద్రరావు, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
భేటీ అనంతరం.. శంషాబాద్ విమానాశ్రయంలోనే జేపీ నడ్డాకు ప్రస్తుత పరిస్థితిని పోలీసులు వివరించారు. అక్కడే నోటీసులు ఇచ్చారు. కరోనా నిబంధనలున్నాయని.. ర్యాలీకి అనుమతి లేదని సీపీ చెప్పారన్న నడ్డా.. సికింద్రాబాద్ గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పిస్తానని స్పష్టం చేశారు. అన్నీ కరోనా నిబంధనలు పాటిస్తానన్నారు. తన ప్రజాస్వామ్య హక్కులను ఎవరూ హరించలేరని స్పష్టం చేశారు. అక్కడ నుంచి సికింద్రాబాద్ చేరుకున్న నడ్డా కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, రాజాసింగ్, డీకే అరుణ, విజయశాంతి, రాంచందర్‌రావు, జితేందర్‌రెడ్డి ఇతర నేతలంతా.. గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా జేపీ నడ్డా సహా నేతలంతా నల్ల మాస్కులు ధరించారు.
రేపటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలు..
హైదరాబాద్ శివారులోని అన్నోజిగూడలోని రాష్ట్రీయ విద్యా కేంద్రం(ఆర్‌వీకే)లో ఈ నెల 5, 6, 7 తేదీల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సమావేశాలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యేందుకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ వచ్చారు. నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు. జాతీయస్థాయిలో జరిగే ఈ సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్‌తో పాటు సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబలే, ఐదుగురు సహ కార్యవాహ్‌లతో పాటు వీహెచ్‌పీ, ఏబీవీపీ, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. భాజపా నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్.సంతోష్‌తో పాటు సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరు కానున్నారు. పరివార్‌లోని సంస్థలు 2021లోని లక్ష్యాల్ని ఏ మేరకు సాధించాయి, 2022లో లక్ష్యాల నిర్దేశం, జాతీయస్థాయి అంశాలు, సంస్థల మధ్య సమన్వయం.. సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇవీచూడండి:
- JP Nadda Hyderabad Tour: శాంతియుతంగా ర్యాలీ జరిగి తీరుతుంది: జేపీ నడ్డా
- Bandi Sanjay: బండి సంజయ్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- BJP Protest in Telangana: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 14 రోజుల పాటు భాజపా నిరసనలు..
- Kishan Reddy on Bandi Sanjay Arrest : 'ధర్నాచౌక్ కేసీఆర్ కోసమేనా.. ప్రతిపక్షాలు ఆందోళన చేయకూడదా?'
- Laxman Fire on TRS: 'బండి సంజయ్ ఘటన అమిత్‌షా దృష్టికి తీసుకెళతాం'
- BJP Leaders on Bandi Sanjay Arrest: అంతా మీ ఇష్టమేనా... మీకు కొవిడ్ నిబంధనలు వర్తించవా?