Etela On CM KCR : ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడున్నరేళ్లలో ఎప్పుడూ ప్రజలను కలిసే ప్రయత్నం చేయలేదని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లానన్న కేసీఆర్ ప్రకటనపై ఈటల విమర్శలు గుప్పించారు. చలో హైదరాబాద్లో భాగంగా ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో వీఆర్ఏల మహాధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఈటల రాజేందర్, సీతక్క, మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వానికి, రెవెన్యూ శాఖకు అనుసంధాన కర్తగా ఉన్న వీఆర్ఏల పట్ల సీఎం కేసీఆర్... తన వైఖరి మార్చుకోవాలని పేర్కొన్నారు.
వీఆర్ఏల సమస్యలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి ఉద్యమ స్ఫూర్తి ఉందని... వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు.
'తప్పు చేసిన వాళ్లను దండించే దమ్ములేక మొత్తం వ్యవస్థనే కుప్పకూల్చి రెవెన్యూ విభాగంలో పనిచేసే సిబ్బంది కళ్లలో మట్టికొట్టే దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. మీరు దేశానికి ప్రధాన మంత్రి కావాలనుకుంటున్నారు. అందుకు మాకు బాధలేదు. కానీ ఇక్కడ కూట్లో రాయి తీయనోడు.. ఏట్లో రాయి తియ్యబోయాడంట.. ఏడున్నరేళ్లలో ప్రజలను కలిసే ప్రయత్నం చేశారా ముఖ్యమంత్రి..? మంత్రులకు అధికారం లేదు, ఎమ్మెల్యేలకు అధికారం లేదు, ముఖ్యమంత్రి వద్దే అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి మాత్రం కలిసే ప్రసక్తే లేదు.' -ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే
అందరూ ఐఖ్యంగా పోరాటం చెయ్యాలి. ప్రభుత్వం మెడలు వంచాలి. స్తంభింపజేయాలి. దిగిరావాలి. ఎవరినైనా దించగలిగే శక్తి తెలంగాణ బిడ్డలకు ఉంది. -సీతక్క, ములుగు ఎమ్మెల్యే
ఇదీ చూడండి : TRS on Bayyaram Steel Plant : 'ఫ్యాక్టరీ తెస్తే దండేసి దండంపెడతాం'