Bjp Leaders Comments On Plenary: దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా చూస్తున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని భాజపా నాయకులు జితేందర్‌రెడ్డి, చంద్రశేఖర్, స్వామిగౌడ్ అన్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పులు మయం చేశారన్న విషయం ప్రతిఒక్కరికీ తెలుసునని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా చూస్తున్నాయని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కేసీఆర్‌కు అనుకూలంగా వ్యవహారిస్తే మీ ఉద్యోగాలకే ముప్పు అని హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమంలో దళితులను ఆకర్షించేందుకే కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించినట్లు మాజీ మంత్రి చంద్రశేఖర్ తెలిపారు. ఉద్యమ పార్టీ అయిన తెరాసకు 800.68కోట్ల నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ చెప్పని పక్షంలో ఎక్కడి నుంచి వచ్చాయో బయటకు తీస్తామన్నారు. కేసీఆర్ దీక్ష సందర్భంగా ఉద్యోగస్థులు సమ్మె చేద్దామంటే వద్దన్న శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్నారని మాజీ శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెరాస ప్లీనరీ వేదికపైన శ్రీకాంతాచారి తల్లి ఉండాల్సిన స్థానంలో ఉద్యమ ద్రోహులు ఉన్నారని మండిపడ్డారు.
ఇదీ చదవండి:బీఆర్ఎస్ కాకపోతే.. అంతర్జాతీయ రాష్ట్ర సమితి పెట్టుకోండి: బండి సంజయ్