కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రాక.. తెరాసలో కాక పుట్టిస్తోందని భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. తెరాస నేతలకు నిద్ర కూడా పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బహిరంగ సభా వేదికగా ప్రజాస్వామిక పాలన, డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుందని ప్రజలకు అమిత్షా భరోసా కల్పిస్తారని తెలిపారు. కాంగ్రెస్, తెదేపా, తెరాసకు అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలు భాజపాకు ఒక్క అవకాశం ఇస్తే.. కుటుంబ, అవినీతి రహిత పాలన అందిస్తామని పేర్కొన్నారు. బహిరంగ సభ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని జోస్యం చెప్పారు.
"ప్రజా సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా.. ప్రతి వ్యక్తికి అందేలా మోదీ కృషి చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీనే తప్ప.. పసలేదని మేము చేసిన ఆరోపణలు నిజమవుతున్నాయి. 2020- 2021 బడ్జెట్ అంచనా.. వాస్తవానికి ఎంతో దూరమని లెక్కలు తేలుస్తున్నాయి. కేంద్రం నుంచి అధిక గ్రాంట్లు ఆశించడం... కేంద్రంపై ఆరోపణలు చేయడం పరిపాటు అయ్యింది. కేంద్రం ఇచ్చే నిధులు ఖర్చు చేయకుండా.. తెరాస సర్కార్ పక్కదారి పట్టిస్తోంది. రాబడి నాలుగో వంతు కూడా లేకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. 11 లక్షల మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకుని పడిగాపులు పడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం అంటేనే పెండింగ్ సర్కార్." -కె.లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు
ఇవీ చూడండి: