భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌పై పోలీసులు దాడికి పాల్పడటాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాయపడిన భానుకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ప్రజాస్వామ్యం ఉందా.. లేదా..? అని ప్రశ్నించారు.
అశ్లీలంపై ప్రశ్నిస్తే భౌతికదాడులు సరికాదని బండి సంజయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆహా ఓటీటీ అశ్లీలానికి కాపుకాసి సీఎం కేసీఆర్ సభ్యసమాజానికి ఏం సందేశం ఇస్తున్నారో స్పష్టం చేయాలన్నారు. డర్టీ హరి సినిమాను తక్షణం నిషేధించాలని కోరారు. యువతను తప్పుదారి పట్టించే ఆహా లాంటి బూతు ఓటీటీలను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. బీజేవైఎం నాయకులను బేషరతుగా విడుదల చేయాలని బండి డిమాండ్ చేశారు.