ఎమర్జెన్సీ ప్రకటించిన జూన్ 25ను బ్లాక్ డేగా పాటించాలని భాజపా డిమాండ్ చేసింది. 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ... దేశంలో అత్యయిక పరిస్థితి విధించి లక్షలాది మంది సామాజిక, రాజకీయ నాయకులను జైళ్లలో నిర్బంధించారని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పౌర హక్కులను హరింపజేసి పత్రికా స్వేచ్ఛ, నాయవ్యవస్థపైనా ఉక్కుపాదం మోపారని మండిపడ్డారు. నియంతృత్వ పాశవిక దమనకాండ ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని దుయ్యబట్టారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అనేకమంది పోరాటాలు చేశారని... వారి పోరాట త్యాగాల ఫలితంగానే 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేశారని గుర్తుచేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమంలో ఆనాడు పోరాటాలు, త్యాగాలు చేసిన వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎమర్జెన్సీని విధించిన 25 జూన్ ను చీకటి రోజుగా నిర్వహించి.. ఆనాటి చేదు అనుభవాలను గుర్తుకు చేసుకునేందుకు భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: హరితహారానికి 'ఆరో' మెట్టు.. రేపు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్