ఫొటోగ్రఫీపై ఉన్న ప్యాషన్‌తో లక్షల్లో వేతనం ఉన్న ఉద్యోగాన్ని వదిలి తన అభిరుచి వైపు అడుగులు వేసింది మరియా. వివిధ దేశాల్లో పర్యటించి అందమైన, విభిన్న రకాల పక్షులను తన కెమెరాలో బంధించింది. ఈ ప్రయాణంలో తన గమ్యాన్ని ఆమె అంత సులభంగా చేరుకోలేదు. ఫొటోగ్రఫీ అంటే అంత సులభం కాదంటుంది మరియా. ఈ సందర్భంగా తన ప్రయాణాన్ని మనతో పంచుకుంది.
ఏదో అసంతృప్తి
రసాయన శాస్త్రంలో డాక్టరేట్ చేసింది మరియా. ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరి ఉన్నత స్థానానికి ఎదిగింది. చిన్నప్పటి నుంచి తనకు ఫొటోగ్రఫీ అంటే ప్రాణం. పక్షులు కనిపిస్తే చాలు.... ఫొటో తీయకుండా వదిలేది కాదు. ఉద్యోగం చేస్తూనే, పర్యాటక ప్రాంతాలకెళ్లి ఫొటోలు తీసేది. అయినా ఏదో అసంతృప్తి. బాగా ఆలోచించాక అర్థమయింది... తన మార్గం ఇది కాదని. వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసింది. బర్డ్స్ ఫొటోగ్రఫీనే కెరీర్‌గా చేసుకుంది. మన దేశంలోమొత్తం 1350 పక్షిజాతులుండగా, వీటిలో 70 శాతానికిపైగా... అంటే 1200 రకాలను ఈ పదేళ్లలో క్లిక్‌మనిపించింది. దేశంలోనే ఇన్ని జాతులను ఫొటోలు, డాక్యుమెంటరీలుగా తీసిన తొలి మహిళా ఫొటోగ్రాఫర్‌గా నిలిచిందామె. మరియా ఫొటోలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలకు ముఖచిత్రాలుగా నిలిచాయి. అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్‌కు, పక్షి పరిశోధకులకు ఈమె తీసిన ఫొటోలు, డాక్యుమెంటరీలే ముడిసరకు. టెడెక్స్ వంటి వేదికలు, కాలేజీలు, పాఠశాలల్లోనూ ఈ రంగంపై అవగాహన కలిగిస్తోంది మరియా. మనదేశానికి చెందిన 50రకాల జాతుల క్షీరదాలపైనా ఈమె తీసిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ ప్రశంసలు పొందింది.
మైళ్లదూరం...
అరుదైన విహంగాలపై ముందుగా అధ్యయనం చేస్తుంది మరియా. ఏ కాలంలో ఏయే ప్రాంతాలకు వస్తాయో పరిశోధించి, అక్కడికి చేరుకుంటుంది. ‘అరుదైన జాతి పక్షి వెస్టెర్న్ ట్రాగోపాన్‌ను ఫొటోలు తీయడం మరవలేను. కింగ్‌ఆఫ్ బర్డ్ అని పిలిచే ఈ జాతి పక్షులు ప్రపంచంలో అయిదువేలు మాత్రమే ఉన్నాయి. అత్యంత ఎత్తైన పర్వతాలపై శబ్ద కాలుష్యం లేని చోట జీవిస్తాయి. మన దేశంలో వేసవిలో అదీ హిమాచల్‌ప్రదేశ్‌లో అరుదుగా కనిపిస్తాయి. ఈ పక్షిని ఫొటో తీయడం నాకు ఛాలెంజ్. దీనికోసం రెండేళ్లు వరుసగా అక్కడికెళ్లా. మొదటేడాది హిమాలయన్ నేషనల్ పార్కుకు ట్రెక్కింగ్ చేసి వెళ్లా. భుజాన కెమెరా, స్టాండు, పరికరాల బరువుతో ఎత్తుకు ఎక్కాలంటే కష్టం. అయినా వరుసగా వారం రోజులు కాపు కాసినా ఆ పక్షి రాలేదు. రెండో ఏడాది కూడా వెళ్లా. వారమైనా రాలేదు. మరోవారం ఎదురుచూశా. అకస్మాత్తుగా ఓ రోజు ట్రాగోపాన్ నేనుండే చోట వాలింది. అద్భుతమైన ఫొటోలు తీయగలిగా. అప్పటివరకు పడ్డ శ్రమ, ఆందోళన మర్చిపోయా. అంతకు ముందు ప్రముఖ ఫొటోగ్రాఫర్లు తీసినవాటి కన్నా నావి ద బెస్ట్ అని ప్రశంసలు అందుకోవడం గర్వంగా అనిపించింది.
పెద్ద ఛాలెంజ్
ఈ రంగాన్ని ఎంచుకోవడమే ఓ ఛాలెంజ్. కొన్నిసార్లు రోజంతా ఆహారం, మంచినీళ్లు తీసుకోడానికి వీలుండదు. మంచు, ఎండ, వానలను తట్టుకోగలగాలి. రాత్రీపగలు గంటల తరబడి ఏకాగ్రతగా, సహనంగా, నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఏ క్షణమైనా మనం ఎదురు చూసే పక్షి రావచ్చు. దానికోసం సిద్ధంగా ఉండాలి. పనిలో పడితే ఆకలిని మర్చిపోతా. రాత్రి సంచరించే గుడ్లగూబ, ఫ్రాక్‌మైత్‌బర్డ్స్, జాస్, ఔలెట్ నైజాస్ వంటి వాటినీ ఫొటోలు తీయగలిగా. ఆరు రకాల అరుదైన జాతి పక్షుల కోసం అండమాన్ నికోబార్, న్యూగినీ దీవులకు, ఆస్ట్రేలియా తదితర దేశాలకు వెళ్లా. నైట్ జార్ జాతిపక్షుల కోసం కేరళ, గుజరాత్, తమిళనాడు, అలస్కా, అరుణాచల్‌ప్రదేశ్ ప్రాంతాల్లో రోజుల తరబడి ఎదురు చూసి మరీ ఫొటోలు తీశా’ అని చెప్పే మరియా ఈ రంగంలో ఔత్సాహికులకు మెంటర్‌గానూ వ్యవహరిస్తోంది. పక్షులకు సంబంధించి అంతర్జాతీయ సదస్సుల్లో మరియాకు ఆహ్వానం రానివి అరుదంటే తన కృషి ఎంతో అర్థం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: Fake doctors: వార్డుబాయ్లే వైద్యులు.. చావు అంచుల్లో రోగులు