ముఖ్యమంత్రి కేసీఆర్కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయ, పాడి పరిశ్రమలను నష్టాల్లోకి నెట్టాలని కంకణం కట్టుకున్నారా అని లేఖలో ప్రశ్నించారు. నియంత్రిత సాగు, సన్న రకాలు అంటూ కనీస మద్దతు ధర కూడా ఇవ్వకుండా కర్షకులను నట్టేటా ముంచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పాడి పరిశ్రమపై కూడా నియంత పాలన చూపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు చేదోడువాదోడుగా, ఇల్లు గడవడానికి ఉపయోగపడే... పాడి పరిశ్రమపై చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు.

విజయ డైరీ ఉత్పత్తిదారులకు లీటరుకు రూ.4 ఇన్సెంటివ్ ఇచ్చిన ప్రభుత్వం... ముల్కనూరు, కరీంనగర్, మథర్ డెయిరీలకు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. బీమా చేయించిన గేదెలు చనిపోయి రెండేళ్లు గడిచినా... ఇన్సూరెన్స్ డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 450 గేదెలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటే... కేవలం 395కు మాత్రమే అప్రూవల్ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు మాత్రం జమ కాలేదన్నారు. వీటికి సంబంధించి రూ.2.75 కోట్లు కలెక్టర్ వద్ద ఉన్నా రైతులకు ఎందుకివ్వట్లేదని నిలదీశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు రైతుల పక్షాన పోరాడతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: 'కాళేశ్వరం, సీతారామ, మిషన్ భగీరథపై సీబీఐ విచారణ జరపాలి'