Bhatti vikramarka on Gandhi Jayanthi: గాంధీ ఆలోచనలకు అనుగుణంగా దేశంలో పాలన జరగడం లేదని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క అన్నారు. భాజపా పాలనలో దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగాయని.. ఒకరిద్దరి చేతిలో సంపద పోగుపడుతోందని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని బస్తీల్లో స్వచ్ఛతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. త్వరలోనే సీఎల్పీ పక్షాన బస్తీబాట చేపట్టి.. సమస్యలను సర్కార్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు.
కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించాక మాట్లాడతాను..: దేశంలో విభజన, అశాంతి.. ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ అసమానతలు లేని దేశం కావాలని కోరుకున్నారని తెలిపారు. భాజపా పాలనలో ఆర్థిక అసమానతలు పెరిగి గాంధీ ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మతాన్ని చొప్పించి లబ్ధి పొందాలని భాజపా చూస్తోందని ఆరోపించిన భట్టి.. ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు. గాంధీ ఆలోచనా విధానంతోనే రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అన్ని బస్తీల్లో సీఎల్పీ పక్షాన పర్యటన చేస్తామని ప్రకటించారు. కేసీఆర్ విమానం కొనుగోలు చేయడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని.. కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై స్పందించిన భట్టి.. పార్టీ ప్రకటించిన తర్వాత దానిపై మాట్లాడతానని తెలిపారు.
'భాజపా ఆలోచనలు.. గాంధీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ఉన్నాయి. గాంధీ ఆలోచనలకు భిన్నంగా పాలన సాగడం మంచిది కాదు. శాంతి, సత్యాగ్రహం, అహింస అందరి జీవితాల్లో భాగం కావాలి. ఇవన్నీ నేడు కేంద్ర ప్రభుత్వంలో కనపడట్లేదు. గాంధీ విధానాలే పరిపాలనలోనూ ఉండాలి. హైదరాబాద్‌లో సరైన సౌకర్యాలు లేని బస్తీలు ఉన్నాయి. సౌకర్యాలు కల్పించేందుకు బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా. మల్లిఖార్జున ఖర్గే అపార అనుభవం కలిగిన నాయకుడు. ఏఐసీసీ అధ్యక్ష బరిలో ఖర్గే నిలవడాన్ని స్వాగతిస్తున్నాం. శశిథరూర్ కూడా ఖర్గేకు మద్దతు ప్రకటించాలని కోరుతున్నాం. ఖర్గే పేరు తెరమీదకు రావడంతో భాజపా నేతలకు భయం పట్టుకుంది.'-భట్టి విక్రమార్క
స్వాగతిస్తున్నాం..: ఏఐసీసీ అధ్యక్ష బరిలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే నిలవడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఖర్గేను ఒక కులానికి పరిమితం చేయొద్దని.. ఆయన గెలుపునకు అంతా మద్దతివ్వాలని భట్టి విజ్ఞప్తి చేశారు. బరిలో ఉన్న మరో సీనియర్ నేత శశిథరూర్ కూడా తన నామినేషన్ ఉపసంహరించుకొని.. ఖర్గేకు మద్దతు ప్రకటించాలని కోరారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన పార్లమెంటు సభ్యులు మల్లిఖార్జున ఖర్గే అపార అనుభవం కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయన ఎన్నికకు దేశంలోని కాంగ్రెస్ నాయకులందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రిగా, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా, ఫ్లోర్ లీడర్‌గా పది సార్లు వరుసగా ఎన్నికల్లో ఓటమి ఎరగకుండా విజయం సాధించిన అపారమైన రాజకీయ అనుభవం.. పరిపాలన దక్షిత, నాయకత్వ లక్షణాలు, కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగిన గాంధేయవాది అయిన ఖర్గే చరిత్రను తెలుసుకొని విష ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు.
ఇవీ చదవండి: