విద్యుత్ రీడింగ్‌లు తీయడం పెద్ద కష్టంతో కూడిన పని. కాస్త తేడా అయినా అటు ప్రభుత్వం ఇటు వినియోగదారులు నష్టపోవాల్సిందే. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు ఓ వినూత్న యాప్(bharat self meter reading app) రూపొందించారు హైదరాబాద్‌కు చెందిన సికిందర్ రెడ్డి, వినయ్ భార్గవ్ రెడ్డిలు.
బీటెక్ పూర్తయ్యాక సికిందర్ యుటిలిటీ సర్వీసుల సంస్థలో చేరాడు. అది టీఎస్‌ఎస్పీడీసీఎల్‌కు సేవలందిస్తుండేది. మీటర్ రీడింగ్, బిల్లింగ్, బిల్లు వసూళ్లు కరెంటు సంస్థలకు చాలా ముఖ్యం. బిల్లింగ్‌లో ఏమాత్రం తేడాలొచ్చినా డిస్కం భారీగా ఆదాయం కోల్పోతుంది. అందుకే ఈ పద్ధతి మార్చేందుకు ఐఆర్‌ఫోర్టు మీటర్లు ఏర్పాటు చేశారు. ఇందులోనూ లోటుపాట్లు ఉండేవి. ఈ అవకతవకలకు ఆస్కారం లేకుండా సంస్థ వేగంగా బిల్లింగ్ చేసే ప్రక్రియ కోరుకుంటున్నట్టు అతడికి అర్థమైంది. ఎప్పటికైనా ఈ సమస్య పరిష్కరించేలా ఆవిష్కరణ చేయాలనుకున్నాడు. తర్వాత కొన్నాళ్లకు ఉద్యోగం మానేసి స్మైల్‌తో ఆడే గేమ్ ఒకటి అభివృద్ధి చేశాడు. వెల్‌బీయింగ్ రంగంలో స్థిరపడాలని వీటిపైనే ఏడాదిన్నర పనిచేశాడు. దీంట్లో నిలదొక్కుకునే వరకు మధ్యలో ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు డిస్కం అవసరాలు గుర్తొచ్చాయి.
ఈ ఆలోచనను కజిన్ వినయ్‌తో పంచుకున్నాడు. తనకి టెక్నాలజీపై మంచి పట్టుంది. సెల్ఫ్‌మీటర్ ఆలోచన గురించి చెప్పాడు. ‘ఆర్నెల్లపాటు పని చేద్దాం. సక్సెస్ అయితే కొనసాగుదాం. లేదంటే ఉద్యోగాల్లోకి వెళ్లిపోదాం’ అనుకున్నారు. ఏడాదిపాటు కష్టపడి ‘భారత్ సెల్ఫ్ మీటర్ రీడింగ్(bharat self meter reading app)’ యాప్ తయారు చేశారు. ఇది వినియోగదారులు, డిస్కమ్‌ల మధ్య వారధిగా ఉంటుంది. ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకున్న యాప్‌తోనే ఫొటో తీసి అప్‌లోడ్ చేస్తే చాలు. డిస్కమ్‌కి వివరాలు వెళ్లిపోయి ఆటోమేటిగ్గా బిల్ జనరేట్ అవుతుంది. సీరియల్ నెంబర్, సర్వీస్ నెంబర్, మీటర్ నెంబర్.. వివరాలన్నీ నమోదు చేయడంతో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఉండదు. ఆ వెంటనే ఒకే క్లిక్‌తో బిల్లు చెల్లించవచ్చు.
ఇదికాకుండా మధ్యమధ్యలో ఇప్పటివరకు ఎంత విద్యుత్తు వాడుకున్నాం.. ఇదే తరహాలో వాడితే ఎంత బిల్లు వస్తుంది అని చెక్ చేసుకోవచ్చు. దానికి అనుగుణంగా వినియోగదారులు అప్రమత్తం కావొచ్చు. డిస్కంలో ఉన్న పరిచయాలతో హైదరాబాద్‌లోని సహారా ఎస్టేట్‌లో ప్రయోగాత్మకంగా సెల్ఫ్‌మీటర్ రీడింగ్(bharat self meter reading app) ఏర్పాటు చేశారు. ఇది విజయవంతమైంది. దాంతో దేశవ్యాప్తంగా అన్ని యుటిలిటీ కరెంట్, నీటి బిల్లులకు ఉపయోగపడేలా సాంకేతికతను అభివృద్ధి చేశారు. దిల్లీలోని టాటా పవర్ పంపిణీ సంస్థ సైతం వీళ్ల సేవలను ఉపయోగించడం మొదలుపెట్టింది. తర్వాత అంతా సాఫీగా సాగిపోలేదు. సంప్రదాయ పద్ధతిలో బిల్లింగ్ చేస్తున్న డిస్కమ్‌లను ఒప్పించేందుకు చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ టెక్నాలజీ(bharat self meter reading app) అభివృద్ధికి ఏడాది సమయం పడితే.. డిస్కమ్‌లను ఒప్పించడానికి రెట్టింపు సమయం తీసుకున్నారు.
ప్రస్తుతం తెలంగాణలోని రెండు డిస్కమ్‌లు, బిహార్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లోనూ ఈ సెల్ఫ్‌మీటర్ రీడింగ్(bharat self meter reading app) సేవలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క బిహార్‌లోనే 25 లక్షల వరకు మీటర్ రీడింగ్‌లు తీశారు. ఈ యాప్‌ని దాదాపు మూడులక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ఆవిష్కరణ యుటిలిటీ రంగంలో పెద్ద మార్పునకు ప్రారంభం కాబోతోంది అంటున్నారీ యువ తేజాలు.