దిల్లీ రణగొణ ధ్వనుల నుంచి దూరంగా ప్రశాంతంగా గడపాలని ఉత్తరాఖండ్‌లోని కంటోన్మెంట్ పట్టణమైన లాన్స్‌డౌన్‌కు కారులో బయలుదేరాం. నిశ్శబ్ద సంగీతాన్ని తలపించే ఆ ఊరి సౌందర్యాన్ని తలచుకోగానే మనసు ఆనంద పారవశ్యంతో నిండిపోయింది. దారిలో కోట్‌ద్వారా దగ్గర ఆగి, ఓ గెస్ట్‌హౌస్‌లో బస చేశాం. కాసేపు ప్రకృతిలో విహరిద్దాం అనుకుని దగ్గరలో ఉన్న నది వద్దకు వెళ్లి సాయంసంధ్యలో ఆకాశంలో కదలాడే రంగుల సౌందర్యాన్ని నీటిలో చూస్తూ ఆనందించాం. ఇళ్లకు చేరేవారు పడవల్లో నదిని దాటుతున్నారు. ‘చీకటి పడకముందే ఇంటికి వెళ్లిపోండి’ అని సలహా ఇచ్చిన ఓ స్థానికుడు అది ఏనుగులు సంచరించే ప్రదేశమని చెప్పడంతో మేం గెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయి, వరండాలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదించసాగాం.
మర్నాడు ఉదయాన్నే లేచి లాన్స్‌డౌన్‌కి ప్రయాణమయ్యాం. అది కోట్‌ద్వారాకి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘాట్‌రోడ్డుకి అటూఇటూ ఉన్న ఎత్తైన కోనిఫెర్ వృక్షాలు స్వాగతం పలుకుతున్నట్లుగా ఊగుతున్నాయి. వాటిని చూస్తుంటే చిక్కని పచ్చదనాన్ని చీల్చుకుంటూ ప్రయాణిస్తోన్న అనుభూతి కలిగింది. మైదాన ప్రాంతం నుంచి సముద్రమట్టానికి 5,600 అడుగుల ఎత్తులోని ఆ నిశ్శబ్ద పట్టణానికి వెళ్లేటప్పుడు చుట్టూ కమ్ముకునే ఆ మేఘాల్ని చూస్తుంటే ఆకాశంలో విహరిస్తున్నామేమో అనిపించింది.
మిలటరీ స్థావరం!
బ్రిటిష్ వాళ్లు పచ్చని సౌందర్యంతో ఉన్న ఈ కొండ ప్రాంతాన్ని చూసి అక్కడ 1887లో ఓ మిలటరీ స్థావరాన్ని ఏర్పాటుచేయాలని అనుకున్నారు. అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ లాన్స్‌డౌన్ కావడంతో ఆయన పేరునే ఈ కొండకు పెట్టారు. ప్రస్తుతం పౌరీ గఢ్వాల్ జిల్లాలో ఉన్న ఈ చిన్న పట్టణ జనాభా ఎనిమిది వేలలోపే. కొండల నిండా ఉన్న పచ్చని చెట్లతో గాలి సడి కూడా లేకుండా, ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశమే ధ్యానముద్రలో ఉందా అన్నంత నిశ్శబ్దంగా ఉంది. ప్రశాంతత కోరుకునేవాళ్ల పాలిట ఇది స్వర్గధామమే. కొండలనిండా పరచుకున్న మబ్బుల్ని చూస్తుంటే ఆ పచ్చదనానికి పరవశించిన దేవతలు నీలిమబ్బుల్నే వాహనాలుగా చేసుకుని దివి నుంచి భువికి వచ్చారేమో అన్న భావన కలిగింది.
ఘనచరిత్ర ఉన్న గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్‌లో చేరి శిక్షణ పొంది ఉత్తీర్ణులైన సిపాయిలు చివరి రోజు ఈ పట్టణంలో ఉన్న పరేడ్ గ్రౌండ్‌లో ప్రతిజ్ఞ చేసే కార్యక్రమాన్ని ఓ పండగలా నిర్వహిస్తారని స్థానికులు చెప్పడంతో చూడ్డానికి వెళ్లాం. దీన్ని పాస్‌ఔట్ అనీ పిలుస్తారు. రంగురంగుల జెండాలతో అలంకరించిన మైదానం జనంతో కళకళలాడుతోంది. శిక్షణ పూర్తిచేసుకున్న సైనికులూ వాళ్ల తల్లిదండ్రులూ బంధుమిత్రులూ రెజిమెంట్ అధికారులూ ఇతర ఆహ్వానితులతో గ్యాలరీ కోలాహలంగా ఉంది. ప్రాంగణంలో సైనికులు బ్యాండ్ శబ్దానికి లయబద్ధంగా అడుగులు వేస్తుంటే అలా చూస్తూనే ఉండిపోయాం.
రంగుల మబ్బులు!
పరేడ్ మైదానానికి అటూ ఇటూ దర్వాన్ సింగ్ సంగ్రహాలయం, వార్ మెమోరియల్ ఉన్నాయి. 1914లో బ్రిటన్-ఫ్రాన్స్‌ల మధ్య జరిగిన యుద్ధంలో సైనికుడైన నాయక్ దర్వాన్ సింగ్ నేగీ అసాధారణ ధైర్యసాహసాలని ప్రదర్శించాడట. ప్రతిగా ఆయనకు విక్టోరియా క్రాస్ బిరుదు ఇచ్చారు. ఈ బిరుదును అందుకున్న మొట్టమొదటి భారత సైనికుడు దర్వాన్ కావడంతో ఆయన పేరుమీద ఇక్కడ మ్యూజియాన్ని ఏర్పాటుచేశారు. బ్రిటిష్ వాళ్లు కట్టిన సెయింట్ మేరీ చర్చిని గఢ్వాల్ రైఫిల్స్ రెజిమెంట్ వాళ్లు మళ్లీ పునరుద్ధరించారు. స్వాతంత్య్రానికి ముందు కాలం నాటి ఫొటోలూ బొమ్మలూ ఆధునిక దృశ్య శ్రవణ సామగ్రితో చర్చికి సరికొత్త హంగులు అద్దారు.
నిశ్శబ్ద వాతావరణంలో పురాతన కాలం నాటి ఆ చర్చిలోకి అడుగుపెడితే ఎంతో ప్రశాంతంగా అనిపించింది. తరవాత భుల్లా సరస్సులో విహరించాం. మేఘాలూ సూర్యకిరణాల మధ్య జరిగే దాగుడుమూతల్నీ వాటి మధ్య ఏం జరుగుతుందో చూడాలనే ఆత్రంతో ఆకాశంలో ఎగబాకినట్లున్న కోనిఫెర్ చెట్ల అందాన్నీ చూస్తూ అక్కడి నిశ్శబ్ద సంగీతాన్నీ వింటూ ఎంతసేపు ఉన్నా తనివితీరదనిపించింది. మలిసంజెలో అయితే నారింజవర్ణాన్ని నింపుకున్న మబ్బుల్నీ మెరిసే కొండఅంచుల్నీ చూడటం కోసమైనా అక్కడే ఉండిపోవాలనిపించింది. కానీ ఈ రోజుకాకుంటే రేపయినా ఇంటికి రాక తప్పదు కాబట్టి గుండెలనిండా స్వచ్ఛమైన గాలిని పీల్చుకుని వెనుతిరిగాం.
ఇవీ చూడండి: లాక్డౌన్ వేళ... వాళ్లు రవివర్మ చిత్రాలయ్యారు!