విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డిని తెలంగాణ బీసీ మహిళా సంక్షేమ సంఘం నేతలు కలిశారు. పాఠశాల, జూనియర్, డిగ్రీ స్థాయిలోని అన్ని తరగతుల విద్యార్థినిలకు ఆత్మ రక్షణ విద్య అందించేందుకు ఆదేశాలు ఇవ్వాలని వినతి పత్రం అందించారు. సంక్షేమ సంఘం ఉమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మణి మంజరి సాగర్ నేతృత్వంలో మహిళా నేతలు హైదరాబాద్లో మంత్రి సబితను కలిశారు. అనంతరం మహిళా కమిషన్ ఛైర్మన్ సునీతా లక్ష్మరెడ్డిని కూడా కలిసి వినతి పత్రం అందించారు.
సమాజంలో మహిళలపై ఎన్నో దారుణాలు, ఘోరాలు జరుగుతున్నాయని వాటిని సమర్థంగా ఎదుర్కోవాలంటే పోలీస్ వ్యవస్థ పటిష్ఠతతో పాటు మహిళలకు డిఫెన్స్ టెక్నిక్స్ రావాలని మణి మంజరి సాగర్ అన్నారు. ప్రతి బాలికకు పాఠశాల దశలోనే ఆత్మ రక్షణ నేర్పించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అభిప్రాయడ్డారు. అప్పుడే తమను తాము రక్షించుకోగలుగుతారని చెప్పారు.
వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాల, కళాశాలల్లో విద్యార్థినిలకు ఆత్మ రక్షణ మెళకువలను నేర్పించాలని కోరినట్లు మంజరి తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఇందుకు సంబంధించిన జీఓను విడుదల చేయించాలని కోరారు. తామ విజ్ఞప్తికి మంత్రి సబితా, సునీత లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. విద్యార్థినిలకు ఆత్మ రక్షణ విద్య అంశంపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని మంత్రి సబితా చెప్పినట్లు వెల్లడించారు. మహిళా కమిషన్ తరఫున తాము కూడా ఈ అంశంపై కృషి చేస్తామని సునీత లక్ష్మా రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి : ప్రేమించిన యువతిని తుపాకీతో కాల్చి.. ఆపై తానూ కాల్చుకుని..