తెలంగాణ సంస్కృతిని బతుకమ్మ పండుగ ప్రపంచానికి చాటి చెప్పింది. తెలంగాణ ప్రజల బతుకు చిత్రంగా నిలిచింది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ సంబురాలు జరగనున్నాయి. అయితే... ఇప్పటికే ఊరూవాడా ముస్తాబవ్వాల్సింది. అందరి ఇళ్లలో బంధువుల కోలాహలం మెుదలయ్యేది. ఈ ఏడాది పెత్రమాస వచ్చినా ఎక్కడా ఆర్భాటాలు కనిపించటం లేదు.
రాష్ట్ర పండుగగా..
తెలంగాణ ఏర్పడిన తర్వాత బతుకమ్మను సర్కారు రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఏటా కోట్ల రూపాయలు వెచ్చించి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించేది. పండుగ విశిష్టతను చాటిచెప్పేలా...వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేకంగా బతుకమ్మ ఘాట్‌ని ఏర్పాటు చేసింది. ఈసారి కరోనా కారణంగా ఎలాంటి సంబురాలు చేయటం లేదని సర్కారు స్పష్టం చేసింది. ప్రజలు ఎవరికి వారు ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది.
కొవిడ్ నిబంధనలతో..
బతుకమ్మ అంటేనే ఆడపడుచులంతా ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా నిర్వహించుకుంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. మరి భారీగా జనం గుమికూడరాదన్న నియమాలతో.. బతుకమ్మ వెలవెలబోతుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఓ వైపు కరోనా, మరోవైపు వరదలు వెరసి బతుకమ్మ సంబరాలు సాదాసీదాగా జరగనున్నట్లు కనిపిస్తోంది. ఆడపడుచులకు ఇచ్చే బతుకమ్మ చీరలను ఎలాంటి ఆటంకం లేకుండా సర్కారు పంపిణీ చేస్తోంది.