Bathukamma sarees Distribution 2022 : హైదరాబాద్‌లో బతుకమ్మ చీరల పంపిణీకి సర్వం సిద్ధం చేశారు. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ నుంచి వచ్చిన 240 డిజైన్ చీరలను ఆడపడుచులకు అందించనున్నారు. ఈనెల 25 నుంచి పంపిణీ ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మొత్తం 30 సర్కిళ్లలోని 150 డివిజన్లలో ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ విభాగం ద్వారా పంపిణీ జరుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బతుకమ్మ పండగను అంగరంగ వైభవం నిర్వహించడానికి పూనుకుంది. తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడేలా మహిళలకు అందమైన చీరలను పంపిణీ చేస్తుంది. అందుకుగానూ ఈ ఏడాది 340 కోట్ల రూపాయల వ్యయంతో 1కోటి 18 లక్షల చీరలను ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.
సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు జగిత్యాల జిల్లాలో నేతన్నలతో బతుకమ్మ చీరల తయారీ కొనసాగుతోంది. ఈసారి 17 కొత్త వర్ణాలతో 17 డిజైన్స్‌లతో కలిపి మొత్తం 240 డిజైన్స్‌లో ఈసారి బతుకమ్మ చీరల తయారు చేయిస్తున్నారు. గత ఏడాది 96 లక్షల చీరల పంపిణీ చేశారు. ఈ ఏడాది 10 వేల మంది చేనేత కార్మికులతో ఆరు నెలల నుంచి కోటి 18 లక్షల చీరలు తయారు చేయిస్తున్నారు. వీటిని బతుకమ్మ పండుగ ప్రారంభంకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోంది.