ముందుగా చెప్పినట్టుగానే భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. సీఎం కేసీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. వరద సాయం నిలిపివేయాలని భాజపా లేఖ రాసినట్లు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. భాజపా లెటర్‌హెడ్, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారాయన. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే నకిలీ లేఖను సృష్టించారని, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనత తెరాసదేనని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వరద బాధితులందరికీ సాయం అందించాకే ఎన్నికలకు వెళ్లాల్సిందని విమర్శించారు. వరదసాయం రూ.550 కోట్లలో సగం నిధులు తెరాస నాయకులే కాజేశారని ఆరోపించారు. సర్వేలన్నీ భాజపాకు అనుకూలంగా ఉన్నాయనే తప్పుడు ప్రచారానికి తెరలేపారని బండి విమర్శించారు.