balapur laddu auction 2022: వేల సంఖ్యలో భక్తజనం.. నిమజ్జనం వేళ కోలాహలం.. లక్షల్లో పలికిన వేలం పాట.. లంబోదరుడి చేతిలోని లడ్డూ ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ. ఇలా బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలం పాటపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏటా లడ్డూకు అత్యంత ధర పలుకుతూ ఆశ్చర్యానికి గురి చేస్తున్న బాలాపూర్ గణేశుడు.. మరోసారి తన రికార్డును నిలబెట్టుకున్నాడు. తొలుత 1994లో రూ.450తో మొదలైన లడ్డూ వేలం పాట.. అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో రూ.లక్షలు పలుకుతోంది. ఈసారీ బాలాపూర్ లడ్డూ ధర రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లింది. రూ.24 లక్షల 60 వేలకు ఉత్సవ సమితి సభ్యుడు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.
ముగ్గురు స్థానికేతరులకు.. ఆరుగురు స్థానికులకు మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సాగిన వేలం పాటలో.. చివరకు స్థానికుడైన లక్ష్మారెడ్డినే అదృష్టం వరించింది. గతేడాది కంటే ఈసారి రూ.5 లక్షల 70 వేలకు ఎక్కువగా పాడి లక్ష్మారెడ్డి లడ్డూను కైవసం చేసుకున్నారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరై ఆద్యంతం వేలం పాటను వీక్షించారు. 29 ఏళ్లుగా వైభవంగా లడ్డూ వేలంపాటను నిర్వహిస్తున్న బాలాపూర్ ఉత్సవ సమితికి అభినందనలు తెలిపారు. గణేశుడి ఆశీస్సులతో బాలాపూర్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ లడ్డూవేలం పాటను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు రావడంతో బాలాపూర్ ముఖ్య కూడలితో పాటు వీధులన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి.
1994 నుంచి 2022 వరకు వేలంలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి..