Avanthi Srinivas: ఏపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావును అడుగడుగునా ప్రజలు నిలదీస్తున్నారు. విశాఖ జిల్లా పద్మనాభం మండలం చిన్నాపురంలో 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో ప్రజలు స్థానిక సమస్యలపై ప్రశ్నించారు. ఇంటి నిర్మాణం చేసి సంవత్సరమవుతున్నా ఇప్పటి వరకు బిల్లు రాలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో అక్కడున్న నాయకులు, అధికారులు కలుగజేసుకొని సర్ది చెప్పడానికి ప్రయత్నించడంతో ఆమె ఒకింత ఆగ్రహానికి గురైంది. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగామని.. ఎన్ని రోజులు పడుతుందో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావును నిలదీసింది. ఏం సమాధానం చెప్పలేక అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయారు.
గ్రామంలో తాగునీటి సమస్య ఉందని, సక్రమంగా కాలువలు లేక మురుగునీరు రోడ్లపైన ప్రవహిస్తోందని ఎమ్మెల్యే ముందు వాపోయారు. వారసత్వంగా వస్తున్న సాగులో ఉన్న ప్రభుత్వ భూమిని జగనన్న కాలనీలకు తీసుకున్నారని.. ఎలాంటి నష్ట పరిహారం చెల్లించలేదని ఎమ్మెల్యే అవంతికి తెలిపారు. దీంతో తహసీల్దార్‌ను పిలిచి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.