ప్రముఖ రచయిత, బహుభాషావేత్త డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి ఇకలేరు. హైదరాబాద్ చైతన్యపురిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1935లో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరులో ఆయన జన్మించారు. కాకినాడలో విద్యాభ్యాసం చేశారు. తెలుగు కథానికపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. 1969 నుంచి 93 వరకు తెలుగు అకాడమీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన డిప్యూటీ డైరెక్టర్‌గా పదవీవిరమణ పొందారు.
ఉత్తమ అనువాదకులు:
ఈనాడు పాత్రికేయ పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా సేవలందించారు. తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ మాండలికాల్లో రచనలు చేసిన మొదటి వ్యక్తిగా ఖ్యాతి గడించారు. పరమహంస యోగానంద రాసిన యాన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ సెయింట్ అనే పుస్తకాన్ని దక్షిణామూర్తి తెలుగులో ఒకయోగి ఆత్మకథగా అనువదించారు. ఉత్తమ అనువాదకుని అవార్డుతో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్న ఆయనను అక్షర తపస్విగా సాహితీవేత్తలు భావిస్తుంటారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇవాళ తుది శ్వాస విడిచారు.
తొలి నవలలు రచించిన కీర్తి :
వెలుగూ వెన్నెలా గోదారీ, ముత్యాల పందిరి, రంగవల్లి అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ మాండలికాల్లో రచించారు. మూడు మాండలికాల్లోనూ తొలి నవలలు రచించి కీర్తి సంపాదించారు. మరెన్నో నవలలు, కథలు, పరిశోధన వ్యాసాలు రచించారు. అనేక అనువాదాలు చేశారు.
దత్తాత్రేయ తీవ్ర సంతాపం:
అక్షర తపస్వి డాక్టర్ పోరంకి దక్షిణామూర్తి మరణం పట్ల.. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకుడిగా అనేక చర్యలు చేపట్టి తెలుగు భాషాభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. మంచి ఆధ్యాత్మిక భావాలు, నైతిక విలువలు గల వ్యక్తి దక్షిణామూర్తి అని దత్తాత్రేయ కొనియాడారు. వారి మరణం తెలుగు సాహిత్యానికి తీరని లోటు అని అన్నారు.
ఇదీ చూడండి: అనధికార సెలవుల్లో ఉన్న వారిపై వైద్య విద్యా శాఖ వేటు