దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ కొవిడ్ మహమ్మారి నుంచి వేగంగా కోలుకుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. పర్యాటక, ఆతిథ్య రంగాలు పుంజుకుంటున్నాయని చెప్పారు. ఆస్ట్రేలియా హైకమిషనర్ హబారీ ఓ ఫారెల్ ఎవో నేతృత్వంలోని ప్రతినిధి బృందం హరీశ్ రావును కలిసింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించారు.
పెట్టుబడులకు అనువు
సౌరవిద్యుత్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో వాతావరణం అనువుగా ఉంటుందని మంత్రి చెప్పారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లోని మెడికల్ డివైసెస్ పార్కు గురించి మంత్రి వివరించారు. దేశంలోనే తొలి మెడికల్ డివైసెస్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే విదేశీ పెట్టుబడిదారులు సంప్రదిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయం, సాగు నీరు అంశాలను ఆస్ట్రేలియా బృందం తెలుసుకుంది.
24గంటల విద్యుత్
దేశంలో 24 గంటలు విద్యుత్ ఇస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని హరీశ్ రావు తెలిపారు. ఏడాదికి కోటి ఎకరాల్లో సాగు అవుతోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం ద్వారా ఏటా 300 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును భవిష్యత్తులో సందర్శించాలనుకుంటున్నట్లు ఆస్ట్రేలియా హైకమిషనర్ తెలిపారు.
రాయబార కార్యాలయం ఇక్కడే పెట్టండి
దేశంలో కొత్తగా ఆస్ట్రేలియా రాయబార కార్యాలయాలు పెట్టే అవకాశం ఉంటే హైదరాబాద్‌లో పెట్టాలని... తద్వారా పారిశ్రామిక వేత్తలు, విద్యార్థులకు అనువుగా ఉంటుందని మంత్రి హరీశ్ రావు సూచించారు. హైదరాబాద్‌లో రాయబార కార్యాలయం పెట్టేందుకు పరిస్థితులు అనువుగా ఉన్నాయని, పరిశీలిస్తామని ఆస్ట్రేలియా బృందం తెలిపింది.
ఇదీ చదవండి : ఇతర రాష్ట్రాలకు 'వీ హబ్' ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి కేటీఆర్