ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని మాన్సాస్ ట్రస్టు వ్యవహారాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. 16 సంవత్సరాల తర్వాత ఆడిట్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. వరుస వివాదాలతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆడిట్ నిర్వహించాలని ఆ శాఖను కోరినా.. అధికారులు స్పందించలేదని మాన్సాస్ నిర్వాహకులు చెబుతున్నారు. చివరికి గత నెలలో ఆడిటింగ్‌కు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచించారని.. అందుకు రాతపూర్వకంగా సమ్మతి తెలియజేశామని అంటున్నారు. ఆడిట్‌కు ట్రస్టు రికార్డులు లేదా హార్డ్ కాపీని కార్యాలయానికి పంపించాలని అధికారులు కోరగా.. వాటిని అప్పగించామంటున్నారు.
'రికార్డులన్నీ అరకొరగా ఉన్నాయి'
ఈ పరిణామాల మధ్యనే జిల్లా ఆడిట్ అధికారి హిమబిందు, సహాయ ఆడిట్ అధికారి తిరుపతి నాయుడు.. ట్రస్టు కార్యాలయంలో రికార్డులను సోమవారం పరిశీలించారు. ఆడిటింగ్ చేసేందుకు కావాల్సిన రికార్డులు అరకొరగా ఉన్నాయని, కేవలం ప్రాథమిక సమాచారం మాత్రమే ఉందని అధికారులు అన్నారు. అవసరమైన రికార్డులన్నీ సమర్పించాలంటూ లేఖ ద్వారా ట్రస్టును కోరారు. ప్రతి సంవత్సరం ఆడిట్ నిర్వహించేందుకు అధికారికంగా రుసుము చెల్లిస్తున్నామని ట్రస్టు ఛైర్మన్ అశోక్ గజపతిరాజు కొన్నిరోజుల కిందటే అన్నారు. ఆడిట్ నిర్వహించలేదంటే అది అధికారుల వైఫల్యమేనని స్పష్టంచేశారు.
అశోక్ గజపతి గతంలో చేసిన వ్యాఖ్యలపై ఆడిట్ శాఖ అధికారులు స్పందించారు. ఆడిటింగ్ మొత్తం పూర్తయ్యాకే రుసుము నిర్ణయించి వసూలు చేస్తామని చెబుతున్నారు. ఆడిట్ కోసం ఏటా రుసుము చెల్లించామని మాన్సాస్ ట్రస్ట్ నిర్వాహకులు చెబుతున్నందున.. రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు బయటపడతాయమంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాన్సాస్ ట్రస్టు వ్యవహారాలపై ఆడిట్ ఎప్పుడు నిర్వహిస్తారన్నది తెలియడం లేదు.
ఇదీ చదవండి: CS Somesh Kumar: జోనల్ విధానంపై సత్వర కార్యాచరణ