Atmakuru By-poll: స్వల్ప ఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 64.17 శాతం ఓటింగ్ నమోదైంది. 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. సాధారణ ఎన్నికలతో పోలిస్తే.. ఓటింగ్ శాతం కొంత తగ్గింది. ఉప ఎన్నిక కావడంతో ఓటు వేసేందుకు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. పోలింగ్ సందర్భంగా ఆత్మకూరు మండలం బట్టేపాడు కేంద్రంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ.. అక్కడే ఉన్న స్వతంత్ర అభ్యర్థి తూమాటి శశిధర్ రెడ్డి వైకాపా నేతలను అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులకు, శశిధర్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది.
అప్పారావుపాలెంలోనూ వైకాపా ఏజెంట్లకు, స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మర్రిపాడు మండలం కృష్ణాపురం పోలింగ్ కేంద్రంలో భాజపా ఏజెంట్ విష్ణుని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. భాజపా అభ్యర్థి భరత్ కుమార్ యాదవ్‌ను కారులో తీసుకెళ్తున్న ఏజెంటుని తిమ్మనాయుడు పేట వద్ద గుర్తించి రక్షించారు. ఈ సమయంలో భాజపా, వైకాపా నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకొంది. పడమటినాయుడు పల్లి పోలింగ్ కేంద్రం వద్ద గుంపులు గుంపులుగా ఉన్న వైకాపా నాయకులను చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. వారంతా పోలీసులపై ఎదురుదాడి చేసేందుకు యత్నించారు.
"ఆత్మకూరు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేశాం. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి 70 శాతం వరకూ పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. ఓ పోలింగ్ కేంద్రంలో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించిన కొందర్ని పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 26న ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఉంటుంది." -ముఖేష్ కుమార్ మీనా, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
వైకాపా తరఫున పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది ఐటీ, పరిశ్రమల మంత్రిగా పని చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి ఈ ఏడాది ఫిబ్రవరి 21న మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఖాళీ అయిన ఈ స్థానానికి.. నేడు ఉపఎన్నిక జరిగింది. జూన్ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
ఇవీ చూడండి..
Universities staff: విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు.. ఉత్తర్వులు జారీ