వర్షాకాల సమావేశాలు రేపటితో వాయిదా పడే అవకాశాలున్నాయి. కరోనా కేసుల నేపథ్యంలో సమావేశాలను ముందుగానే ముగించాలన్న నిర్ణయానికి వచ్చారు. ఒక శాసనసభ్యునితో పాటు పలువురు సిబ్బంది, పోలీసులకు కూడా కొవిడ్ పాజిటివ్ నిర్ధరణైంది. సభా వ్యవహారాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే పేషీల్లో కూడా కొందరికి కరోనా వచ్చింది. రోజురోజుకూ కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సమావేశాలను ఇంకా కొనసాగిస్తే మరింత మందికి సోకే అవకాశం ఉందని భావిస్తున్నారు.
కీలకమైన బిల్లులన్నీ సభ ఆమోదం పొందినందున సమావేశాలను కుదించాలని భావిస్తున్నారు. ఈ మేరకు శాసనసభాపక్ష నేతలతో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి చర్చించారు. కృష్ణాజలాలు సహా పలు కీలక సమస్యలపై చర్చించాల్సి ఉందని... కొన్నాళ్ల పాటు కొనసాగించాలని కాంగ్రెస్ కోరింది. గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని మజ్లిస్ అభిప్రాయపడింది. రేపు గ్రేటర్ హైదరాబాద్ సహా పురపాలికలపై సభలో స్వల్వ కాలిక చర్చ జరిగే అవకాశం ఉంది. సమావేశాల ముగింపునకు సంబంధించి రేపు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: టీఎస్‌బీపాస్ సహా 8 బిల్లులకు మండలి ఆమోదం