Ask IIT Madras program: విదేశాల్లో మద్రాస్ ఐఐటీ శాటిలైట్ ప్రాంగణాలను ఏర్పాటు చేయాలన్న దానిపై చర్చిస్తున్నామని ఐఐటీ మద్రాస్ సంచాలకుడు ఆచార్య వి.కామకోటి పేర్కొన్నారు. విదేశాల్లో ఐఐటీ ప్రాంగణాలను నెలకొల్పేందుకు అవసరమైన విధి విధానాల రూపకల్పనకు ఇటీవల నిపుణుల కమిటీని నియమించిన నేపథ్యంలో శాటిలైట్ ప్రాంగణాల ఏర్పాటుపై అన్ని చోట్ల చర్చ సాగుతుందన్నారు. ఐఐటీ అశావహుల్లో అవగాహన పెంచేందుకు హైదరాబాద్ టీహబ్‌లో 'ఆస్క్ ఐఐటీ మద్రాస్' పేరిట పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఐటీ మద్రాస్ సంచాలకుడు ఆచార్య వి.కామకోటి, పూర్వ విద్యార్థుల విభాగం డీన్ మహేష్ విద్యార్థుల సందేహాలను నివృత్తిచేశారు.
ఇప్పటికే తమ ఐఐటీతో ఇతర దేశాల్లోని వర్సిటీలతో కలిసి 10 ఇంటర్నేషనల్ జాయింట్ బీటెక్, ఎంటెక్ కోర్సులను అందిస్తున్నామన్నారు. దీంతో నేపాల్, టాంజానియా వంటి పలు ఆఫ్రికా దేశాలు తమ దేశాల్లో ప్రాంగణాలు నెలకొల్పాలని అడుగుతున్నాయన్నారు. అయితే..ఆ అంశంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్నారు. వైద్య రంగంలో టెక్నాలజీ అవసరం బాగా పెరిగినందున వచ్చే ఏడాది మెడికల్ టెక్నాలజీలో బీటెక్ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. భవిష్యత్తు అవసరాల కోసం ప్రస్తుతం తమ సంస్థ వద్ద రూ. 550 కోట్ల కార్ఫస్ ఎండోమెంట్ నిధి ఉందన్నారు. అందులో కొంత మొత్తం పూర్వ విద్యార్థుల విరాళాలు ఉన్నాయని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మొత్తం రూ. 2వేల కోట్ల నిధిని తయారు చేయాలన్నది తమ ప్రణాళికగా ఉందన్నారు. ఐఐటీ మద్రాస్‌లో 25శాతం తెలుగు రాష్ట్రాల విద్యార్ధులే ఉన్నారని కామకోటి పేర్కొన్నారు.
బీటెక్‌లో నాలుగేళ్లలో 4,500ల మంది ఉండగా.. అందులో 1,200ల మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన వారే ఉన్నారని పూర్వ విద్యార్థుల విభాగం డీన్ మహేష్ వివరించారు. ఈనెల 17వ తేదీన వర్చువల్ టూర్ ఉంటుందని, విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌లోని అన్ని విభాగాలను అక్కడే ఉన్నట్లుగా చూడవచ్చన్నారు. కేవలం సైన్స్ చదివితేనే భవిష్యత్తు అన్న ఆలోచన చేయవద్దని, ఇంజనీరింగ్ ఫిజిక్స్ లాంటి వాటిల్లోనూ అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. విమానం కంటే వేగంగా ప్రయాణించే హైప్ లూప్ రైలుపై ఐఐటీ మద్రాస్ పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: