ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ హెటిరో కంపెనీతోపాటు డైరెక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై వాదనలు మంగళవారం ముగిశాయి. ఈ పిటిషన్లపై సుదీర్ఘ వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పును వాయిదా వేశారు. హెటిరో తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సీబీఐ ఉద్దేశపూర్వకంగా కొన్ని అంశాలను తొక్కిపెట్టి తనకు అవసరమైన వాటినే తీసుకుంది. సీబీఐ వాదనలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిల నుంచే ప్రారంభించింది. వారిద్దరూ పెట్టుబడులకు పథక రచన చేశారని వాదించింది.
"వారి వ్యవహారంతో మాకు (హెటిరోకు) ఎలాంటి సంబంధమూ లేదు. అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని మేం వ్యతిరేకించలేదు. కంపెనీ వ్యవహారాల్లో డైరెక్టర్ పాత్రను తీసుకోవడాన్నే ప్రశ్నించాం. జగతిలో పెట్టుబడులు మా కంపెనీకి చెందినవి. అవి మా విచక్షణ మేరకే ఉంటాయి. హెటిరోకు ప్రభుత్వం భూమి కేటాయింపుల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రస్తావించాలి తప్ప, పెట్టుబడుల గురించి కాదు. సీబీఐ దర్యాప్తు అనుచితంగా ఉంది" అని పేర్కొన్నారు. దీనిపై రాతపూర్వక వాదనలు సమర్పించాలని పిటిషనర్లతోపాటు సీబీఐని ఆదేశిస్తూ న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
వాన్‌పిక్‌పై ప్రభుత్వ నిర్ణయాలే అమలు..
ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడమే తమ విధి అని మాజీ ఐఆర్‌ఎస్ అధికారి కె.వి.బ్రహ్మానందరెడ్డి తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. వాన్‌పిక్ ప్రాజెక్టు వ్యవహారంలో వ్యక్తిగతంగా తాను లబ్ధి పొందినట్లుగానీ, దురుద్దేశపూర్వకంగా మరొకరికి ప్రయోజనం కల్పించినట్లుగానీ సీబీఐ అభియోగ పత్రంలో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో వాన్‌పిక్ ప్రాజెక్టు కేసు నుంచి తనను తప్పించాలన్న డిశ్ఛార్జి పిటిషన్‌ను కొట్టివేస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ బ్రహ్మానందరెడ్డి హైకోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదీ చూడండి: బట్టల షాప్‌కెళ్లిన పల్సర్ బైక్.. అసలేం జరిగిందంటే?