Nayanthara-Vignesh : నూతన జంట నయనతార, విఘ్నేశ్ శివన్ తాజాగా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తిరుమల మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని తిరగడం.. ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవడంతో ఈ వివాదం తలెత్తింది. దీంతో తితిదే అధికారులు ఈ జంటపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వివాదంపై వివరణ ఇస్తూ విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ లేఖ విడుదల చేశారు.
ఆ సమయంలో తమ కాళ్లకు చెప్పులు ఉన్న సంగతి గుర్తులేదని చెప్పుకొచ్చారు. దేవుడిపై తమకు అపారమైన నమ్మకం, భక్తి ఉందని.. తాము తెలియక చేసిన తప్పుకు క్షమించాలని కోరారు.
Nayanatara TTD controversy : ‘‘తిరుమలలోనే పెళ్లి చేసుకోవాలని ఎంతోకాలంగా అనుకున్నాం. ఈ క్రమంలోనే గడిచిన 30 రోజుల్లోనే 5 సార్లు ఈ కొండకు వచ్చాం. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో మహాబలిపురంలో చేసుకోవాల్సి వచ్చింది. అయితే, పెళ్లైన వెంటనే మండపం నుంచి నేరుగా తిరుమలకు వచ్చి స్వామి కల్యాణం వీక్షించి.. ఆశీస్సులు తీసుకోవాలనుకున్నాం. అదే విధంగా శుక్రవారం స్వామివారి దర్శనం చేసుకున్నాం. దర్శనం అనంతరం మా పెళ్లి ఇక్కడే జరిగిందనే భావన కలగడం కోసం ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆలయ ఆవరణలో ఫొటోషూట్ చేసుకోవాలనుకున్నాం.
కాకపోతే ఆసమయంలో ఆలయ ఆవరణలో భక్తులు ఎక్కువగా ఉండటం వల్ల వెళ్లిపోయి.. మళ్లీ తిరిగి అక్కడికి వచ్చాం. ఫొటోషూట్ వెంటనే పూర్తి చేయాలనే గందరగోళ పరిస్థితుల్లో మా కాళ్లకు చెప్పులు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోయాం. దేవుడిపై మాకు అపారమైన నమ్మకం ఉంది. మేము ఎంతగానో ఆరాధించే స్వామి వారిని అవమానించడానికి ఇలా చేయలేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి’’ అని విఘ్నేశ్ శివన్ రాసుకొచ్చారు.
అసలేం జరిగింది.. ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్న నయనతార-విఘ్నేశ్ శివన్ తమిళనాడులోని మహాబలిపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో గురువారం వివాహం చేసుకున్నారు. శుక్రవారం ఉదయం ఈ జంట తిరుమల స్వామి సేవలో పాల్గొంది. దర్శనం అనంతరం ఈ దంపతులు ఆలయం ఎదుట ఫొటోషూట్ తీయించుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా మాడ వీధుల్లో పాదరక్షలతో తిరిగారు. గుర్తించిన భక్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకొని, అభ్యంతరం తెలిపారు. మాడ వీధుల్లో పాదరక్షలతో తిరగడం, అనుమతుల్లేకుండా ఫొటోషూట్ నిర్వహించడంపై సీవీఎస్‌వో నరసింహప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నయనతారకు నోటీసులు జారీ చేస్తామన్నారు.