ఆంధ్రప్రదేేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించినందున రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినట్లేనని స్పష్టం చేశారు.
నాలుగు దశల్లో పూర్తి...
నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని.. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 17 వరకు ప్రవర్తన నియమావళి అమల్లో ఉంటుందని లేఖలో తెలిపారు. తొలిదశ ఎన్నికలు ఈనెల 23న ప్రారంభం అవుతాయని.. మొత్తం పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఫిబ్రవరి 17లోగా పూర్తి చేసేలా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన విషయాన్ని ప్రస్తావించారు.
కోడ్ పాటించేలా చూడండి..
ప్రస్తుతం ఎన్నికల ప్రవర్తన నియమావళి కేవలం గ్రామీణ ప్రాంతాల పరిధిలోనే ఉంటుందని.. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల పరిధిలో ఎన్నికల కోడ్ లేదని స్పష్టం చేశారు. ప్రవర్తన నియమావళిలోని నిబంధనలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, ఇతర వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పనులను కేవలం పట్టణాలు, నగరాలకు పరిమితం చేసేలా ఆదేశించాలని సూచించారు. నియమావళి ముగిసేంత వరకు పట్టణాలు, నగరాల్లో సభలు నిర్వహించి- గ్రామీణులకు ప్రయోజనం చేకూర్చే పనులు చేయరాదని... అలా జరిపితే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు ఎన్నికల కోడ్‌ను సక్రమంగా పాటించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాసిన లేఖలో ఎన్నికల కమిషనర్ కోరారు.