ఎస్ఈసీ దారుణంగా వ్యవహరిస్తున్నారని ఏపీ తెదేపా నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాజకీయ నేతలతో ఆ రాష్ట్ర ఎస్‌ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై నేతల అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెదేపా తరఫున వర్లరామయ్య సమావేశంలో పాల్గొన్నారు. మొక్కుబడిగా సమావేశం ఏర్పాటు చేసినట్లు అనిపిస్తోందని విమర్శించారు.
‘మా నుంచి సమస్యలు, సూచనలు తీసుకోవాలని కోరాం. ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోందని ఎస్‌ఈసీకి తెలిపాం. ఇటీవల జరిగిన నాలుగు దఫాల పంచాయతీ ఎన్నికల్లో దౌర్జన్యాలు, దాడులు జరిగాయి. దాడులపై వివరించాలని ప్రయత్నిస్తే నిరాకరించారు. రీకౌంటింగ్‌పై ప్రశ్నిస్తే అడగకూడదని ఎస్‌ఈసీ తెలిపారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరాం. ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తే సమాధానం లేదు. మాట్లాడేందుకు మాకు 5 నిమిషాలే అవకాశమిచ్చారు. ఎస్‌ఈసీ చిత్తశుద్ధితో వ్యవహరించాలని తెదేపా తరఫున కోరాం. ఎస్‌ఈసీపై మాకు అనుమానాలు వస్తున్నాయి. ఎస్ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు’- వర్లరామయ్య
మొబైల్ ఫోన్ల డిపాజిట్‌పై అభ్యంతరం: వైకాపా
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎస్‌ఈసీని కోరినట్లు సమావేశంలో పాల్గొన్న వైకాపా నేతలు తెలిపారు. వాలంటీర్లు మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేయాలన్న ఆదేశాలపై అభ్యంతరాలు తెలిపినట్లు ఆ పార్టీ నేత నారాయణమూర్తి చెప్పారు. వాలంటీర్ల హక్కులను కాపాడాలని కోరినట్లు తెలిపారు. నిబంధనల పేరుతో వాలంటీర్ల వ్యవస్థను నిలుపుదల చేయొద్దని కోరినట్లు వైకాపా నేత చెప్పారు.
ఇదీ చదవండి: ఎన్‌డీఏ అంటే నో డేటా అవైలబుల్: కేటీఆర్