తెలంగాణ అభివృద్ధిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తెరాస పార్టీ కార్యకలాపాలు ప్రారంభించాలని వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయన్నా కేసీఆర్ వ్యాఖ్యలను.. మీడియా ప్రతినిధులు మంత్రి అనిల్ వద్ద ప్రస్తావించారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అభివృద్ధిని ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం చెయ్యేలేదని.. ఏం చేసినా రాష్ట్రమంతా అమలుచేశామన్నారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయా..? అని వ్యాఖ్యానించారు. ఒకేసారి లక్షన్నర ఉద్యోగాలు భర్తీ చేశామని.. తెలంగాణలో చేశారా..? ప్రశ్నించారు. తెలంగాణలో ఏ సంక్షేమాన్ని చూసి తాము నేర్చుకోవాలో చెప్పాలన్నారు. తెలంగాణలో అమ్మ ఒడి, నాడు- నేడు, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారా..? అంటూ ప్రశ్నలు సందించారు.
'ఉపఎన్నికల కోసం ఒక్క నియోజకవర్గంలో 10 లక్షలు పంచుతున్నారు. ఏపీలో అలా చేయలేదు.. రాష్ట్రవ్యాప్తంగా పథకాలు అమలుచేస్తున్నాం. ఏపీలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చాం. మరి ఏం సంక్షేమం చేసి.. తెలంగాణ నుంచి మేం నేర్చుకోవాలి. ఇంకా జగన్ తెలంగాణ వస్తారని వాళ్లు ఆలోచించాలి గానీ.. వాళ్లు ఏపీకి వస్తారని మేం ఆలోచించనక్కరలేదు.'
-అనిల్‌కుమార్, ఏపీ మంత్రి
కేసీఆర్ ఎమన్నారంటే..
'ఆంధ్రప్రదేశ్‌లో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటా'మని ఏపీ నుంచి విజ్ఞాపనలు వస్తున్నాయని తెరాస అధ్యక్షుడు, సీఎం కేసీఆర్(KCR speech in trs plenary) అన్నారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారని కేసీఆర్ వెల్లడించారు. హైటెక్స్‌లో తెరాస ప్లీనరీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.