AP High Court serious on Twitter: న్యాయవ్యవస్థ, న్యాయమూర్తులపై పలువురు పెట్టిన అభ్యంతరకర పోస్టులను తొలగించడంలో నిర్లక్ష్యం వహించిన ట్విటర్‌పై ఏపీ హైకోర్టు నిప్పులు చెరిగింది. సాంకేతిక కారణాలు చూపుతూ న్యాయస్థానంతో దోబూచులాడుతున్నారని మండిపడింది. ఇలాంటి చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పింది. భారతదేశంలో సేవలు అందించాలంటే ఇక్కడి చట్టాలు, కోర్టు ఉత్తర్వులను గౌరవించాల్సిందేనని పేర్కొంది. ఆ విధంగా నడుచుకోకపోతే వ్యాపారాన్ని మూసేసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా కేసుపై తాజాగా జరిగిన విచారణలో ఏపీ హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.
AP HC on Twitter : గత విచారణలోనే ఆ పోస్టులను తొలగించాలని స్పష్టమైన హెచ్చరిక జారీచేసీన విషయాన్ని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా వ్యవహరించడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టంచేసింది. నోటీసులు జారీచేస్తామని హెచ్చరించింది. భారతదేశ చట్టాలు , కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ట్విటర్ కార్యకలాపాలను నిలుపుదల చేస్తూ ఎందుకు ఉత్తర్వులు ఇవ్వకూడదు అనే విషయంపై తదుపరి విచారణలో వాదనలు చెప్పాలని తేల్చిచెప్పింది. అఫిడవిట్ రూపంలో పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంతకుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది .
గత విచారణలోనే తొలిగించాలని చెప్పినప్పటికీ..
AP HC Serious on Twitter : న్యాయవ్యవస్థ , న్యాయమూర్తులను దూషిస్తూ, అపకీర్తితెచ్చే రీతిలో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన వ్యవహారంపై హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా జరిగిన విచారణలో సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదనలు వినిపించారు. అభ్యంతరకర పోస్టులు తొలగించాలని గత విచారణలో హైకోర్టు స్పష్టంచేసినప్పటికీ ట్విటర్ తొలగించలేదన్నారు. ఇప్పటికీ దర్శనమిస్తున్నాయన్నారు. న్యాయవ్యవస్థను దూషిస్తూ పెట్టిన వీడియోల తొలగింపు ప్రక్రియకు ట్విటర్ సహకరించడం లేదన్నారు. సంబంధిత వ్యక్తి యూజర్ సెంటింగ్ జాతీయత విదేశాలకు చెందినదిగా పేర్కొంటే వాటిని తొలగించడం లేదన్నారు. మళ్లీ తిరిగి కనిపిస్తున్నాయని తెలిపారు. భారతదేశ జాతీయతకాకుండా మరోదేశ జాతీయత చూపి లాగిన్ అయి పెట్టిన పోస్టులను ట్విటర్ తొలగించలేదన్నారు. ట్విటర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. అభ్యంతరకర పోస్టు పెట్టిన వ్యక్తి ప్రొఫైల్లో జాతీయత కాలంలో ఇండియాకు బదులు మరో దేశం పేరు మారిస్తే సంబంధిత యూఆర్ఎల్ తిరిగి కనపడుతుందన్నారు. మిగత సామాజిక మాధ్యమాల విషయంలోనూ ఇదే విధానం ఉందని తెలిపారు.
ట్విటర్ వాదనలపై అభ్యంతరం తెలిపిన యూట్యూబ్..
యూట్యూబ్ తరపు సీనియర్ న్యాయవాది ట్విటర్ తరపు న్యాయవాది వాదనలపై అభ్యంతరం తెలిపారు. తాము మొత్తం పోస్టులను తొలగించామన్నారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, సీబీఐ ఇచ్చిన వివరాల ఆధారంగా 36 గంటల్లో తొలగించామన్నారు. టీవీ చర్చాకార్యక్రమాల్లో మాట్లాడిన అభ్యంతర వ్యాఖ్యలు యూట్యూబ్ వీడియోలో అలాగే ఉంటున్నాయన్నారు. టీవీ 9, సాక్షి టీవీ తదితర మీడియా సంస్థలు వాటంతట వారే తొలగించాలన్నారు. వారికి నోటీసులు ఇవ్వాలని తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీకుమార్ వాదనలు వినిపిస్తూ .. వీపీఎన్ వివరాలను మార్చడం ద్వారా తొలగించిన వీడియోలు మళ్లీ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
న్యాయవ్యవస్థతో ఆడుకుంటున్నారు..
ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం..వ్యక్తిగతంగా తాము ఎవరికి వ్యతిరేకం కాదని .. వీరందరు అభ్యంతరకరమైన పోస్టులు పెడుతూ వ్యవస్థతో ఆడుకుంటున్నారని మండపడింది . దేశ చట్టాలు , కోర్టు ఉత్తర్వులను గౌరవవించనందుకు కార్యకలాపాలను నిలిపేస్తూ ఎందుకు ఉత్తర్వులు ఇవ్వకూడదో అనే అంశంపై తదుపరి విచారణలో వాదనలు చెప్పాలని ట్విటర్‌కు స్పష్టంచేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. మరోవైపు ఇదే వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి భేషరతుగా క్షమాపణలు కోరుతూ అఫిడవిట్ వేశారు. భవిష్యత్తులోనూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయబోనన్నారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆయనపై కోర్టు ధిక్కరణ విచారణ ప్రక్రియను మూసేసింది.