పాఠశాలకు రాని, వచ్చినా మధ్యాహ్న భోజనం చేయని పిల్లలకు ఇంటికి ఇచ్చే కోడిగుడ్ల సంఖ్యను తగ్గించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మధ్యాహ్న భోజనం తినేవారికి వారానికి ఐదు, ఇంటికైతే మూడు గుడ్లు ఇవ్వాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. భోజనం చేయని పిల్లలకు బియ్యంతో పాటు, వంటఖర్చు (కూరగాయలు, నూనె, పప్పులు) కింద కందిపప్పు సరఫరా చేయనున్నారు. డిసెంబరుకు సరకులు, కోడిగుడ్లు, పల్లీచిక్కీల సరఫరాపై జారీ చేసిన ఉత్తర్వుల్లో సంచాలకులు దివాన్‌మైదిన్ ఈ మేరకు పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థులు భోజనం చేసిన రోజులను మినహాయించి, మిగతా రోజులకే సరకులు అందించాలని సూచించారు.
- బడిలో భోజనం చేయని వారికి వారానికి మూడు చొప్పున 12 గుడ్లు ఇవ్వనున్నారు.
- మధ్యాహ్న భోజనం చేసే వారికి వారానికి ఐదు చొప్పున 22 కోడిగుడ్లు అందిస్తారు.
- ఈ నెల 1 నుంచి 31 వరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు 2.5 కిలోలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పిల్లలకు 3.75 కిలోల బియ్యం పంపిణీ చేస్తారు.
- వంటఖర్చు, డైట్ ఛార్జీల కింద ప్రాథమిక పాఠశాలల వారికి రోజుకు రూ.4.97, ప్రాథమికోన్నత, ఉన్నత విద్యార్థులకు రూ.7.45 చొప్పున లెక్కించి ఆ మొత్తానికి కందిపప్పు ఇస్తారు.
ఇవీచూడండి: ఐదో తరగతి వరకు బడులుండవ్..!