ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. అఖిల భారత సర్వీసులు (క్రమశిక్షణ, అప్పీలు) నియమావళిలోని ఎనిమిదో నిబంధన ప్రకారం ఆయనపై పలు అభియోగాలు నమోదు చేసింది. వాటిపై 15 రోజుల్లోగా లిఖితపూర్వకంగా లేదా నేరుగా సంబంధిత అధికారి ఎదుట వాదన వినిపించాలని ఆదేశించింది. నమోదు చేసిన అభియోగాలకే ఆ వాదన పరిమితం కావాలని తెలిపింది. నిర్దేశిత గడువులోగా వాదనలు వినిపించకపోతే తమ వద్దనున్న వివరాలు, అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ కేసు విచారణకు సంబంధించి ఏబీ వెంకటేశ్వరరావు ఆయనకు అనుకూలంగా రాజకీయనాయకులతో లేదా ఇతరులతో ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదని, పైరవీలు, సిఫార్సులు చేయించరాదని వివరించింది. అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అభియోగాల వివరాల్ని ఆ ఉత్తర్వుల్లో సమగ్రంగా పొందుపరిచారు.
నమోదు చేసిన అభియోగాల్లో ప్రధానమైనవి
- ఏపీ పోలీసు శాఖకు కావాల్సిన ఏరోస్టాట్, యూఏవీ అనే భద్రత పరికరాల సరఫరా కాంట్రాక్టు ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్‌టీ ఇన్‌ఫ్లాట్‌బుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్/ఆర్‌టీఎల్‌టీఏ సిస్టమ్స్ లిమిటెడ్‌కు దక్కేలా కొనుగోలు కమిటీ సభ్యులపై ఏబీ వెంకటేశ్వరరావు ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ పరికరాల నాణ్యత, సాంకేతిక, సమర్థత, గ్యారెంటీ, వారెంటీ విషయాలతో పాటు కొనుగోలు నియమావళి పాటించటం, తదితర అంశాల్లో రాజీపడి ఆయన కుమారుడు ఎ.చేతన్ సాయికృష్ణకు అక్రమంగా లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నించారు. ఆర్‌టీ ఇన్‌ఫ్లాట్‌బుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్/ఆర్‌టీఎల్‌టీఏ సిస్టమ్స్ లిమిటెడ్‌లకు భారతదేశంలో ప్రతినిధిగా ఎ.చేతన్ సాయికృష్ణ సీఈవోగా ఉన్న ఆకాశం అడ్వాన్స్‌డ్ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ ఉంది. ఈ విషయాన్ని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లలేదు.
- స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌టీసీఐఎల్)కు కొనుగోలు బాధ్యత అప్పగించారు. ఆ సంస్థ మొదటి రెండు సార్లు టెండర్లు పిలవగా ఒక్కొక్క బిడ్డే దాఖలైంది. వాటిని రద్దు చేశారు. మూడోసారి టెండర్లు పిలిచినప్పుడు మాత్రం మొత్తం నాలుగు బిడ్లు దాఖలయ్యాయి. వాటిల్లో నుంచి ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్‌టీ ఇన్‌ఫ్లాట్‌బుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్/ఆర్‌టీఎల్‌టీఏ సిస్టమ్స్ లిమిటెడ్ ప్రధాన బిడ్డర్‌గా ఎంపికైంది. ఈ సంస్థకే కాంట్రాక్టు దక్కేలా చేయాలనే ఉద్దేశంతో మిగతా మూడు సంస్థలతో బిడ్లు దాఖలు చేయించారు. ఆ మూడు సంస్థలకు భద్రత పరికరాలకు సంబంధించిన తగిన అనుభవం, ఆ రంగంలో తగిన విశ్వసనీయత లేదు.
- ప్రధాన బిడ్డర్‌గా ఎంపికైన తర్వాత ఆ పరికరాలకు సంబంధించిన మొత్తం విలువ రూ.25.50 కోట్లను ఎస్‌టీసీఐఎల్‌కు జమ చేయించారు. పలు సాంకేతిక, పరిపాలన, ఆర్థికపరమైన విధానాల్ని పాటించడంలో లోపాలు, సీవీసీ మార్గదర్శకాలు, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ విధానంలో ఉల్లంఘనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ పరికరాల కొనుగోలు ఆర్డరు రద్దయింది. ఆ తర్వాత ఎస్‌టీసీఐఎల్ నుంచి ఆ డబ్బు రాబట్టడం ఎంతో కష్టమైంది. అయినప్పటికీ ప్రాసెసింగ్ రుసుముల కింద ఎస్‌టీసీఐఎల్ రూ.10లక్షలు మినహాయించుకుంది. ఆ మేరకు ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఖజానాకు ఆర్థిక నష్టం కలిగించారు.
- కొనుగోలు కమిటీలో సాంకేతిక నిపుణుడిని సభ్యుడిగా ఉండేలా ప్రతిపాదించలేదు.
- ఏబీ వెంకటేశ్వరరావు ఇంటి చిరునామా, ఆయన కుమారుడు సీఈవోగా ఉన్న కంపెనీ చిరునామా ఒకటే. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గుర్తించి లేఖ రాసింది.
ఇదీ చదవండి: మంత్రుల వాహనాలను అడ్డుకోబోయిన నేతలు