రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని... అందుకే తాము డీపీఆర్ ఇవ్వకుండా కేవలం సమగ్ర ప్రాజెక్టు వివరాలు మాత్రమే ఇచ్చామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణరెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు సభ్యకార్యదర్శిని కలిసి ఈఎన్‌సీ ఈ విషయాన్ని వివరించారు. ఏపీ కేటాయింపులకు లోబడే నీటిని తీసుకునేలా రీడిజైన్ చేస్తున్నామన్నారు. కొత్తగా ఆయకట్టు అభివృద్ధి చేయడం లేదని స్పష్టం చేశారు. అదనపు నిల్వ సామర్థ్యం కోసం ఎటువంటి నిర్మాణాలు చేయడం లేదని చెప్పారు. కొత్త ప్రాజక్టు కానప్పుడు డీపీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఈ విషయంలో కొంత సమాచార లోపం జరిగిందన్నారు.
కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం విశాఖలో ఏర్పాటు!
నూతన ప్రాజెక్టు కానందున పనులు కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అధ్యయనం కోసం ఎన్జీటీ ఇప్పటికే అనుమతులు ఇచ్చిందని తెలిపారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుల్లో అదనపు ఆయకట్టు, అదనపు నిల్వ సామర్థ్యం ఉందని నారాయణరెడ్డి ఆరోపించారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ప్రధాన కార్యాలయం కేవలం పరిపాలనపరమైనది మాత్రమేనని.... పర్యవేక్షణ విభాగం ఎక్కడున్నా ఇబ్బందులేవీ ఉండబోవని చెప్పారు. విశాఖలో ఎన్నో జాతీయ సంస్థలున్నాయన్న ఈఎన్‌సీ.. జాతీయ ప్రాధాన్యం ఉన్నందునే కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అక్కడే ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
ఇవీచూడండి: 'రామతీర్థం ఘటన నిందితులను మూడురోజుల్లో పట్టుకుంటాం'